
సూర్యాపేట జిల్లా నడిగూడెం కేజీబీవీలో ఘటన
నడిగూడెం: పదోతరగతి చదువుతున్న విద్యార్థిని తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. స్థానిక ఎస్‌ఐ గంధమళ్ల అజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ నిమ్మ వెంకటేశ్వర్లు, వసుంధర దంపతులకు కుమార్తె తనూషా మహాలక్ష్మి (14), ఇద్దరు కుమారులు సంతానం. తనూషా మహాలక్ష్మి నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి చదువుతోంది.
ఈనెల 4వ తేదీన వ్యక్తిగత కారణాలతో బాలిక ఇంటికి వెళ్లింది. తిరిగి 6వ తేదీన పాఠశాలకు వచి్చంది. ఆదివారం తనూషాను చూసేందుకు ఆమె తల్లి పాఠశాల వద్దకు వచ్చి భోజనం పెట్టి వెళ్లింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తండ్రి వెంకటేశ్వర్లు కూడా కుమార్తెను చూసి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తనూషా పాఠశాలలోని తన తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఐదు గంటల సమయంలో తనూషా స్నేహితురాలు తమ తరగతి గదిలోకి వెళ్లగా.. అప్పటికే తనూషా ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది.
రాత్రి విధుల్లో ఉన్న హిందీ ఉపాధ్యాయురాలు సునీత పాఠశాల ప్రత్యేకాధికారి వెంకటరమణకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనతో విద్యాలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, పాఠశాలను సూర్యాపేట జిల్లా విద్యాధికారి అశోక్, తహసీల్దార్ వి.సరిత, జీసీడీఓ తీగల పూలాన్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.