మరో 8 ‘సివిల్‌’ బంకులు

Another 8 civil banks - Sakshi

పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాల్లో ఏర్పాటుకు కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌: పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా మరో 8 రిటైల్‌ పెట్రోల్‌ బంకులు ఏర్పాటు కానున్నాయి. ఇటీవలే 9 పెట్రోల్‌ బంకుల నిర్వహణకు ఆమోదం లభించడంతో మొత్తంగా 17 జిల్లాల్లో పెట్రోల్‌ బంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లయింది. ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా జిల్లాకు ఒకటి చొప్పున పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సూచించారు.

దీంతో జిల్లాల్లో అనువైన స్థలాలను గుర్తించి ఆయా ఆయిల్‌ కంపెనీలకు బంకులు కేటాయించేందుకు సంస్థ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఐదుగురు అధికారులతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ తొలివిడతలో 9 జిల్లాల్లో పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు సిఫార్సు చేసింది. ఈ మేరకు పెట్రోల్‌ బంకుల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. ఇక రెండో విడతలో వరంగల్, వనపర్తి, సూర్యాపేట, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, జనగామ జిల్లాల్లో పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు సంస్థ చైర్మన్‌ రవీందర్‌సింగ్‌ తెలిపారు.

వీలైనంత త్వరగా వినియోగదారులకు సేవలు అందుబాటులోకి తేవాలని ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ ఆయిల్‌ కంపెనీలకు సూచించినట్లు చెప్పారు. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ జీహెచ్‌ఎంసీ పరిధిలో 3 పెట్రోల్‌ రిటైల్‌ బంకులను విజయవంతంగా నిర్వహిస్తోంది. కొత్త బంకులు ఏర్పాటైతే వాటి సంఖ్య 20కి చేరనుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top