6 నెలలు.. రూ.13.82 లక్షల ఆదాయం | Women Run Petrol Bunk In Narayanpet district | Sakshi
Sakshi News home page

6 నెలలు.. రూ.13.82 లక్షల ఆదాయం

Sep 8 2025 7:40 AM | Updated on Sep 8 2025 7:43 AM

Women Run Petrol Bunk In Narayanpet district

ఆదర్శంగా నిలుస్తున్న మహిళా పెట్రోల్‌ బంక్‌

నారాయణపేట రూరల్‌: రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరా మహిళాశక్తి’ని పటిష్టంగా అమలు చేస్తోంది. నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్యలో 8,196 మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిలో 91,369 మంది సభ్యులున్నారు. ఇందిరా మహిళాశక్తిలో భాగంగా జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం క్రాస్‌ రోడ్డులో రూ.1.30 కోట్ల వ్యయంతో జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. 20 ఏళ్లకు నెలకు రూ.10 వేల అద్దె ప్రాతిపదికన మహిళా సమాఖ్య ద్వారా ఈ పెట్రోల్‌ బంక్‌ నిర్వహణకు బీపీసీఎల్‌తో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది. 

మహిళలకు ముందస్తు శిక్షణ..
బంక్‌ నిర్వహణకు సంబంధించిన 11 మంది మహిళలను ఎంపిక చేసి ప్రభుత్వం వారికి ముందస్తుగా జడ్చర్ల, షాద్‌నగర్‌లోని పెట్రోల్‌ బంక్‌లలో మేనేజర్, సేల్స్‌ ఉమెన్లుగా శిక్షణ ఇప్పించింది. మొత్తం వ్యయంలో మౌలిక వసతులు కల్పనకు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. సీఎం ఆదేశాలు మేరకు ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్‌ బంక్‌ నిర్వహణపై కలెక్టర్‌ సమీక్షిస్తున్నారు.

∙మహిళా సమాఖ్య పెట్రోల్‌ బంక్‌లో రోజుకు 4 వేల లీటర్ల పెట్రోల్, 6 వేల లీటర్ల డీజిల్‌ను విక్రయిస్తున్నారు. అందులో విధులు నిర్వర్తించే 10 మంది సేల్స్‌ ఉమెన్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.13,200 చొప్పున, మహిళా మేనేజర్‌కు నెలకు రూ.18 వేలు వేతనంగా జిల్లా సమాఖ్య నుంచి తీసుకుంటున్నారు. మహిళా పెట్రోల్‌ బంక్‌ ద్వారా వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులు పోను ఆరు నెలల్లో రూ.13.82 లక్షల ఆదాయాన్ని ఆర్జించారు.

ఆర్థికంగా ఎదుగుదలకు..
మహిళలు వంటింటికే పరి మితం కాదని నారాయణపేట మహిళా సమాఖ్య నిరూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సా హం బాగుంది. 11 మంది మహిళలం కష్టపడి పనిచేసి రూ.13.82 లక్షల ఆదాయాన్ని గడించాం. 
– చంద్రకళ, పెట్రోల్‌ బంక్‌ మేనేజర్‌

మహిళా స్వావలంబనకు తోడ్పాటు 
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇదొక ముందడుగు. తెలంగాణలోనే కాదు దేశం మొత్తంలో జిల్లా మహిళా సమాఖ్యచే నడిచే మొదటి పెట్రోల్‌ బంక్‌గా గుర్తింపు పొందింది. 
– సిక్తా పట్నాయక్, కలెక్టర్, నారాయణపేట 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement