ప్రశాంతంగా తొలివిడత పోలింగ్
కోస్గి: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం జిల్లాలోని కోస్గి, మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి మండలాల పరిధిలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పల్లె పోరు ప్రశాంతం కావడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మొదటి విడతలో 67 పంచాయతీలకుగాను 14 పంచాయతీలు, 572 వార్డులకుగాను 210 వార్డులు ఏకగ్రీవం కాగా.. 53 పంచాయతీలకు, 361 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 66,689 మంది ఓటర్లకు 56,403 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో అత్యధికంగా 86.70 శాతం ఓటింగ్ కోస్గి మండలంలో, అత్యల్పంగా 83.06 శాతం ఓటింగ్ గుండుమాల్ మండలంలో నమోదైంది. కొత్తపల్లి మండలంలోని దుప్పటిగట్ పంచాయతీలో అత్యధికంగా 94 శాతం, అత్యల్పంగా అదే మండలంలోని భూనిడ్ పంచాయతీలో 77 శాతం ఓటింగ్ నమోదైంది.
తగ్గుతూ.. పెరుగుతూ..
పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. అధికారులు ఓటింగ్ సరళిని మూడు దశలుగా విభజించి ఓటింగ్ శాతాన్ని నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి దశలో కేవలం 21.13 శాతం నమోదైంది. 9 నుంచి 11 గంటల వరకు 36.58 శాతం, 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు 24 శాతం నమోదైంది.
సర్జఖాన్‌పేట్‌ను సందర్శించిన ఎస్పీ
కోస్గి రూరల్: మండలంలోని సమస్యాత్మక గ్రామమైన సర్జఖాన్‌పేట్‌లోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ వినీత్ గురువారం సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇదిలాఉండగా, గ్రామంలో బుధవారం అర్ధరాత్రి అధికార పార్టీ అభ్యర్థి కుటుంబ సభ్యులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తూ వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకోగా.. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈక్రమంలో పోలీసులు ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకులు అర్ధరాత్రి ధర్నా చేపట్టారు. దీంతో ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకొని మరోసారి లాఠీచార్జ్ చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈక్రమంలో ఎస్పీ గ్రామాన్ని సందర్శించారు.


