వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి

Dec 11 2025 9:52 AM | Updated on Dec 11 2025 9:52 AM

వెబ్‌

వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి

నారాయణపేట: రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న మొదటి విడత పోలింగ్‌లో భాగంగా వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్‌ సంచిత్‌గంగ్వార్‌ అన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌/మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణను జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. మొదటి విడతలో జిల్లాలో గుర్తించిన 34 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఓ శ్రీధర్‌, నోడల్‌ అధికారి సాయిబాబా, డీపీఆర్‌ఓ రషీద్‌ పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌కు ‘ఫెసిలిటేషన్‌’

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పిస్తోందని.. ఈ మేరకు సంబంధిత మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అడిషనల్‌ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో తొలి, మలి విడత ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారన్నారు. గ్రామాల్లో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు దానిని వినియోగించుకునేందుకు ఈ నెల 12, 13 తేదీల్లో అవకాశం కల్పించారని, ఇందుకోసం మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్న మక్తల్‌, కృష్ణా, మాగనూర్‌, ఊట్కూర్‌, నర్వ మండ లాల్లో ఫెసిలిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు, సిబ్బంది ఓటరు జాబితాలో తమ పేరు కలిగి ఉండాలని, అలాగే ఎన్నికల విధులు నిర్వహించే ఆర్డర్‌ కాపీని చూపించాలన్నారు. అధికారులు ఇచ్చిన బ్యాలెట్‌ పేపరులో తమకు ఇష్టమైన అభ్యర్థికి పెన్నుతో టిక్‌ మార్కు చేసి, డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తర్వాత అక్కడే ఉన్న బ్యాలెట్‌ బాక్స్‌లో వేయాలని సూచించారు. పోస్టల్‌ నోడల్‌ అధికారిగా డీఏఓ జాన్‌సుధాకర్‌ను నియమించామన్నారు.

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

మద్దూరు/కోస్గి రూరల్‌: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ ఆదేశించారు. బుధవారం పట్టణలోని పంచాక్షరి ఫంక్షన్‌హల్‌లో గుండుమాల్‌, కోస్గి మండలంలో ఎన్నికల నిర్వహణ, బందోబస్తుపై సమీక్ష చేశారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని కొత్తపల్లి, మద్దూర్‌, కోస్గి, గుండుమాల్‌ మండలాలకు 650 మంది పోలీసు ఫోర్స్‌, 2 టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్లు, సీఐడీ ఫోర్స్‌తో భారీ భద్రత ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నాలుగు మండలాల్లోని 67 గ్రామపంచాయతీలు ఉండగా, 14 ఏకగ్రీవం కాగా.. మిగతా 53 పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహణ చేపట్టామన్నారు. 13 సమస్యాత్మక గ్రామ పంచాయతీల్లో 27 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామని తెలిపారు. విధి నిర్వహణలో పోలీసులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తపల్లి, మద్దూరు మండలాలను 18 రూట్లు గాను, కోస్గి, గుండుమాల్‌ మండలంలో 15 రూట్లుగాను విభజించి బందోబస్తు చేపడుతున్నామన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి మద్యం, డబ్బులు పంపిణీ, రాజకీయ పార్టీల ప్రచారం చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్‌ కేంద్రం నుంచి 200 మీటర్ల దూరం వరకు గుంపులుగా ఉండకూడదన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు లింగయ్య, మహేష్‌, సీఐ సైదులు, ఎస్‌ఐలు విజయ్‌కుమార్‌, బాల్‌రాజు తదితరులు ఉన్నారు.

ఎన్నికల కోసం

135 స్కూల్‌ బస్సులు

పాలమూరు: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలకు సామగ్రిని తరలించేందుకు ఆర్టీఏ శాఖ 135 ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు, 34 వాహనాలను ఏర్పాటు చేశారు.ఆర్టీఓ రఘుకుమార్‌ బస్సుల కేటాయింపుతో పాటు రూట్‌ విధానాలపై పర్యవేక్షించారు. ఒక్కో బస్సుకు ఒక రూట్‌ కేటాయించి ఆ మార్గాల్లో బస్సులను పంపించారు.

వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి    
1
1/1

వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement