‘18 గుర్తింపు కార్డుల్లో దేనినైనా తీసుకెళ్లొచ్చు’
నారాయణపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమయంలో 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానిని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్, ఆధార్ కార్డు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీస్/ బ్యాంక్ పాస్‌బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డ్, ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధృవీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, పట్టాదార్ పాస్‌పుస్తకం, రేషన్ కార్డు, ఫొటోతో కూడిన ఆయుధ లైసెన్స్ పత్రం, ఫ్రీడం ఫైటర్ ఐడీ కార్డు, ఆర్టీఐ ద్వారా జారీ చేయబడిన ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డులో ఏదైనా ఒక దానిని చూపించి ఓటు వేయవచ్చని కలెక్టర్ సూచించారు.
నిర్ణీత సమయంలో పోలింగ్ ప్రారంభించాలి
కోస్గి: గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియను నిర్ణీత సమయంలో ప్రారంభించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి, మద్దూరు, గుండుమాల్, కోస్గి మండలాల్లోని ఎన్నికల అధికారులు సామగ్రిని, బ్యాలెట్ పత్రాలు, బాక్సులు, అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. గుండుమాల్ మండల కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సంచిత్‌గంగ్వార్, కొత్తపల్లి శ్రీను సందర్శించారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, డీఆర్‌డీఓ మొగులప్ప, తహసీల్దార్లు శ్రీనివాసులు, భాస్కరస్వామి, ఎంపీడీఓలు శ్రీధర్, వేణుగోపాలస్వామి ఉన్నారు.


