పటిష్ట బందోబస్తు..
నారాయణపేట: గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని గ్రామాభివృద్ధికి పాటుపాడాలని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇచ్చే డబ్బులు, బహుమతులు, మద్యం తీసుకొని ఓటును అమ్ముకోవద్దని హితువు పలికారు. ఇలాంటివి తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని 13 మండలాల్లోని 272 గ్రామ పంచాయతీలు, 2,466 వార్డు స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ జీపీ ఎన్నికల బందోబస్తు వివరాలను వెల్లడించారు.
జిల్లాలో సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్‌లో ఈ నెల 11న మొదటి విడతలో, డిసెంబర్ 14న రెండో విడత నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ, మరికల్, నారాయణపేట, దామరగిద్ద మండలాల్లో, 17న మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, మాగనూర్, కృష్ణా, ఊట్కూర్, నర్వ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు విడతల్లో జరిగే ఎన్నికలు, కౌంటింగ్‌కు భద్రత కల్పించడంతో పాటు ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
650 మందితో బందోబస్తు
జిల్లా పోలీసు యంత్రాంగంలోని డీఎస్పీలు ఐదుగురు, సీఐలు 10 మంది, ఎస్‌ఐలు 45 మంది, ఏఎస్‌ఐ, హెచ్‌సీలు 135, పీసీలు 350, హోంగార్డులు 120 మందితో పాటు డీసీఆర్బీ, ఏఆర్, సీఐడీ, ఇతర విభాగాల సిబ్బందిని ఎన్నికల విధులను నిర్వర్తిస్తారన్నారు. సాధారణ, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు వేర్వేరుగా బందోబస్తు నిర్వహించేలా ఇది వరకే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఈ ఎన్నికల్లో ఎవరైనా ఒత్తిడి, ఇబ్బందులకు గురి చేసినా, అక్రమాలకు, నేరాలకు పాల్పడినా వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
జిల్లావ్యాప్తంగా..
జిల్లాలో 272 జీపీలు ఉండగా.. అందులో 60 జీపీలు, 632 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు పోలీసుశాఖ గుర్తించిందన్నారు. మొదటి విడతలో 67 జీపీల్లో 21 జీపీలు.. 200 పోలింగ్ కేంద్రాలు, రెండో విడతలో 95 జీపీల్లో 18 జీపీలు.. 200 పోలింగ్ కేంద్రాలు, మూడో విడతలో 110 జీపీలకు గాను 21 జీపీలు.. 232 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పాతనేరస్తుల జాబితాలోని 820 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎస్‌ఐల పర్యవేక్షణలో ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు, మరికొందరు హోంగార్డులతో సమస్యత్మక పీఎస్‌ల వద్ద బందోబస్తు నిర్వహిస్తారన్నారు. సాధారణ పోలింగ్ కేంద్రాల వద్ద ఒక్కొక్కరు గస్తీ నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు.
ఆరు చెక్‌పోస్టులు ఏర్పాట్లు
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అక్రమ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు జిల్లాకు సరిహద్దులోని కర్ణాటక, తెలంగాణ బార్డర్‌లో కానుకుర్తి, కృష్ణా, టై రోడ్, చేగుంట, సమస్తపూర్, జలాల్‌పూర్, ఎక్లాస్‌పూర్‌లో ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. ఓటర్లను బలవంతంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించినా, భయబ్రాంతులకు గురిచేసినా డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
820 మంది బైండోవర్
సమస్యాత్మక గ్రామాలు 60..
పోలింగ్ కేంద్రాలు 632
ర్యాలీలు, మీటింగ్‌కు
అనుమతి తప్పనిసరి
‘సాక్షి’తో
ఎస్పీ డాక్టర్ వినీత్
పటిష్ట బందోబస్తు..


