కేంద్ర నిధులతోనే ప్రగతి బాటలో పల్లెలు
నారాయణపేట రూరల్: గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే జరుగుతుందని, పల్లెలు మరింత అభివృద్ధి చెందాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు నాగురావునామాజీ కోరారు. బుధవారం నారాయణపేటలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కే.రతంగపాండురెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సత్యయాదవ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, రోడ్లు, బాలిక సంరక్షణ, రైతు, కార్మిక సంక్షేమం, పేదల ఆకలి తీర్చేందుకు ఉచిత బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అమలు అవుతున్నాయని తెలిపారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్రానికి మద్దతుగా నిలబడాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. రూపాయి కూడా గ్రామాలకు ఇవ్వలేదని విమర్శించారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న బీజేపీ మద్దతుదారులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులు, మీడియా ఇన్‌చార్జి కిరణ్‌డగే తదితరులు పాల్గొన్నారు.


