పల్లె తీర్పు నేడే..
మొదట వార్డు సభ్యుల
ఓట్ల లెక్కింపు
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
● గ్రామ ప్రథమ పౌరులను
తేల్చనున్న ఓటర్లు
● 53 పంచాయతీలు, 374 వార్డులకు ఎన్నికలు
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
● పర్యవేక్షిస్తున్న కలెక్టర్
సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్
మద్దూరు/కోస్గి: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామ సర్పంచులు ఎవరనేది ఓటర్లు గురువారం తేల్చనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రమే అధికారులు, సిబ్బంది ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలీసు బలగాలు భద్రతను పర్యవేక్షించనున్నాయి. ఇదిలా ఉండగా సర్పంచ్‌గా పోటీ పడుతున్న అభ్యర్థుల ప్రచారం గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. అప్పటి నుంచి ప్రలోభాల పర్వం మొదలుపెట్టారు. అభ్యర్థులు నేరుగా ఓటర్ల ఇంటికి వెళ్లి నగదు, మద్యం, బహుమతులు ఇచ్చి ఓటు తమకే వేయాలని ప్రమాణాలు చేయించుకున్నారని ఓటర్లు చర్చించుకుంటున్నారు.
కొడంగల్ నియోజకవర్గ పరిధిలో..
జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి, మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి మండలాల్లో మొత్తం 67 గ్రామ పంచాయతీలుండగా 14 పంచాయతీలు, 572 వార్డుల్లో 198 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 53 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా 169 మంది సర్పంచ్ అభ్యర్థులు, 374 వార్డులకు 807 మంది వార్డు సభ్యులుగా పోటీ పడుతున్నారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి మొత్తం 572 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్కో పీఓ, ఏపీఓలతో పాటు అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో
వెబ్ కెమెరాలు
ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 572 పోలింగ్ స్టేషన్లకు 686 మంది పీఓలను, 785 మంది ఏపీఓలను, స్టేజ్–1 ఆఫీసర్లుగా 352, స్టేజ్–2 ఆఫీసర్లు 81 మంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 200 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 32 వెబ్ కెమెరాలు బిగించినట్లు అధికారులు తెలిపారు. వీరితో పాటు 162 మంది మైక్రో పరిశీలకులు వారికి కేటాయించిన రూట్లలో పని చేస్తున్నారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. 25 ఓట్లను ఒక బెండల్‌గా వేరు చేసి మొదట వార్డుల వారీగా ఓట్లు లెక్కింపు మొదలు పెడతారు. గ్రామంలో మొదటి వార్డు మొదలు కొని చివరి వార్డు వరకు ఫలితాలు వెల్లడిస్తారు. తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని చోట్ల పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ తెలిపారు.


