–విడుదలం సరైనదేనని మద్రాస్ హైకోర్టు తీర్పు
సాక్షి, చైన్నె: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె. జయలలితను సంపద పన్ను (వెల్త్ ట్యాక్స్) కేసు నుంచి ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ నిర్దోషిగా విడుదల చేయడం పూర్తిగా సరైనదేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన మూడు అప్పీళ్లను న్యాయస్థానం కొట్టివేసింది. పలు సంవత్సరాల పాటు తన సంపద పన్ను రిటర్న్‌లను దాఖలు చేయలేదంటూ ఆదాయపు పన్ను శాఖ గతంలో జయలలితపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల నుంచి తనను విడుదల చేయాలని కోరుతూ జయలలిత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్, ఆమెకు అనుకూలంగా తీర్పునిస్తూ కేసు నుంచి విడుదల చేసింది. అయితే, ట్రిబ్యునల్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ 2008, 2009 సంవత్సరాల్లో ఆదాయపు పన్ను శాఖ మద్రాస్ హైకోర్టులో మూడు అప్పీళ్లు దాఖలు చేసింది.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో, జయలలిత మరణానంతరం ఆమె చట్టబద్ధమైన వారసులుగా మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌లను ప్రతివాదులుగా చేర్చారు. జస్టిస్ అనితా సుమంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అప్పీళ్లు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా దీపక్ తరఫు న్యాయవాది సుదర్శనం వాదనలు వినిపిస్తూ.. అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసిందని, కాబట్టి ఆదాయపు పన్ను శాఖ అప్పీళ్లను కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సమర్థించింది. జయలలిత నివాసంలోనే శశికళ తదితరులు కూడా నివసించారని, సదరు ఆస్తుల అసలు యాజమాన్యం ఎవరిదనే విషయాన్ని నిర్ధారించడంలో ఆదాయపు పన్ను శాఖ విఫలమైందని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో జయలలితపై కేసు నమోదు చేయడం సరికాదని, ఆమెను నిర్దోషిగా విడుదల చేస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులు సబబేనని స్పష్టం చేస్తూ ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన మూడు అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది.
రూ. 4 కోట్ల విలువైన
హైగ్రేడ్ గంజాయి స్వాధీనం
– కస్టమ్స్ అధికారుల చర్యలు
అన్నానగర్: థాయ్‌లాండ్ నుండి విమానంలో చైన్నెకి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి రూ. 4 కోట్ల విలువైన 4 కిలోల అత్యుత్తమ నాణ్యత గల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి శనివారం ఉదయం చైన్నెకి వచ్చిన ఒక ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేశారు.ఆ సమయంలో, అతనికి ఎండిన, ఆకుపచ్చ–గోధుమ రంగులో ఉన్న, పూలు పూయని మొక్కల పైభాగాల నాలుగు ప్యాకేజీలు ఉన్నా యి. అవి అధిక నాణ్యత గల హైడ్రోపోనిక్ గంజా యి అని తేలింది. అనంతరం అధికారులు గంజా యిని స్వాధీనం చేసుకుని, ప్రయాణికుడిని అరెస్టు చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (నివారణ) చట్టం, 1985 కింద చర్య తీసుకుని, అరెస్టు చేసిన వ్యక్తిని కోర్టులో హాజరుపరిచి, జ్యుడిషియల్ రిమాండ్‌కి తరలించారు.
నేటి నుంచి కార్తీక బ్రహ్మోత్సవాలు
– ఏర్పాట్లు పూర్తి
– నేడు ధ్వజారోహణంతో ప్రారంభం
వేలూరు: తిరువణ్ణామ లై అరుణాచలేశ్వరాల య కార్తీక బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వ జారోహణంతో అంగరంగ వైభవంగా ప్రా రంభం కానున్నాయి. ఏటా అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మో త్సవాలు పది రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితిగా వస్తుంది. అందులో భాగంగా కార్తీక దీప బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7.25 గంటలలోపు అన్నామలైయార్ ఆలయ సన్నదిలో ఉన్న 61 అడుగుల బంగారు ద్వజ స్థంభానికి శివాచార్యులు ప్రత్యేక పూజలు, పుష్పాలంకరణలు చేసి ద్వజారోహణం చేస్తారు. అనంతరం పది రోజుల పాటు జరిగే ఉత్సవంలో ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామి వార్లు వివిధ వాహనాల్లో మాడ వీధుల్లో భవని వచ్చి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆదివారం ఉదయం పంచ మూర్తులు అద్దాల అధికార నంది వాహనంలోను, సాయంత్రం పంచ మూర్తులు మూషిక, హంస, వెండి, సింహ వాహనాల్లో ఊరేగనున్నారు. పది రోజుల పాటు స్వామి వార్లు వివిధ వాహనాల్లో ఊరేగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లును ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ ఆధ్వర్యంలో ఇప్పటికే సిద్ధం చేశారు.
కొండ ఎక్కేందుకు అనుమతి నిరాకరణ?
ప్రతి సంవత్సరం మహా దీపాన్ని తిలకిచేందుకు లక్షలాది మంది భక్తులు మహా దీపం కొండ ఎక్కి దీపాన్ని దర్శించుకునే వారు. అయితే ఈ సంవత్సరం వర్షాలు అధికంగా కురవడంతో కొండ పూర్తిగా పాచి పట్టి ఉండటంతో పాటు కొండల్లో అక్కడక్కడ చరియలు ఏర్పడి మట్టితో పాటు బండ రాల్లు కింద పడే అవకాశం ఉంది. దీంతో ఈ సారి భక్తులు మహా దీపం కొండను ఎక్కిందుకు అనుమతి నిరాకరించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది.


