సాక్షి, చైన్నె: పుదుక్కోట్టై జిల్లా విరాలిమలై నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికలో మాజీ మంత్రి సి. విజయభాస్కర్‌ను ఓడించడమే లక్ష్యంగా అన్నాడీఎంకే శ్రేణులు ముమ్మరంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పుదుక్కోట్టైలోని అన్నాడీఎంకే జిల్లా కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ సంప్రదింపుల సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేశారు. 2011 నుంచి విరాలిమలై నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చిన సి. విజయభాస్కర్ ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అన్నాడీఎంకేను వీడి తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరారు. ఆయనతో పాటు అన్నాడీఎంకేలోని పలువురు కీలక నేతలు కూడా ఆ పార్టీలోకి వెళ్లారు. దీనిపై స్పందించిన అన్నాడీఎంకే అధిష్టానం, పార్టీ మారిన వారిని వెంటనే తొలగించి వారి స్థానాల్లో కొత్త నిర్వాహకులను నియమించింది. త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న దృష్ట్యా, సి. విజయ భాస్కర్ మళ్లీ పోటీ చేసే అవకాశాలే ఉన్నాయి. దీంతో ఆయన్ని ఓడించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టేందుకు అన్నాడీఎంకే ఉరకలు తీసింది. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులను ఏకం చేసి శనివారం పుదుకోట్టైలో సమావేశం నిర్వహించారు.


