సాక్షి, చైన్నె: గత ప్రభుత్వ హయాంలో ప్రజా పనులు, రహదారుల శాఖలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని తమిళనాడు ప్రజా పనుల శాఖ మంత్రి అధవ్ అర్జున ఆరోపించారు. ముఖ్యంగా 2025లో రోడ్లపై గుంతలు పూడ్చే (ప్యాచ్‌వర్క్) పనుల కోసమే రూ. 2,200 కోట్లు కేటాయించి అవినీతికి పాల్పడ్డారని, అలాగే తిరువాన్మియూర్–ఉదండి హై–స్పీడ్ రోడ్డు ప్రాజెక్టులోనూ భారీ కుంభకోణం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గత ఆరు నెలల్లో ప్రజా పనులు, రహదారులు, చిన్న పరిశ్రమలు, క్రీడావృద్ధి రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదిక పుస్తకాన్ని ఆ యన విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి అధవ్ అర్జున మాట్లాడుతూ గత ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
టెండర్లలో పారదర్శకత.. బినామీలకు చెక్
ప్రభుత్వ శాఖల కార్యకలాపాల్లో పూర్తి పారదర్శకతను తీసుకురావడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రుల బినామీ సంస్థలే ఎక్కువ టెండర్లను దక్కించుకున్నాయన్నారు. దీనిపై ఇప్పటికే ఫిర్యాదులు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఏ ఒక్క కుటుంబానికీ ఆధిపత్యం ఉండదదని, తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే శాఖలను పునర్వ్యవస్థీకరించి, టెండర్ ప్రక్రియలో పారదర్శకతను తీసుకొచ్చామని ఆయన తెలిపారు. తిరువాన్మియూర్–ఉదండి హై–లెవల్ రోడ్డు ప్రాజెక్టు ప్రస్తుతం సలహా కమిటీ పరిశీలనలో ఉందని, దీనిని పునరుద్ధరించి కొత్తగా టెండర్లు పిలవనున్నామని చెప్పారు. ఇక, తేనాంపేట – సైదాపేట ఎలివేటెడ్ రోడ్డు పనులను వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేసి ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని 8, 10 లేన్ల జాతీయ రహదారి ప్రాజెక్టులపై చర్చించేందుకు ఈ నెల 17న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నట్లు తెలిపారు. రాబోయే 75 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా నాణ్యమైన ప్రమాణాలతో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తామని, ఇకపై నాసిరకం నిర్మాణాలకు తావులేదని స్పష్టం చేశారు. ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలను గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 14 అంతస్తులతో నిర్మించనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5,226 పాఠశాలల్లో నిర్వహించిన సర్వేలో శిథిలావస్థకు చేరి, ఉపయోగించడానికి వీలులేని పాఠశాలలకు ఎరుపు రంగు హెచ్చరిక స్టిక్కర్లు అంటించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 15,661 మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయని, రాబోయే రెండేళ్లలో పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక వసతులను పూర్తిస్థాయిలో మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
పర్యాటక, క్రీడా రంగాలకు పెద్దపీట
చైన్నె – మహాబలిపురం – పుదుచ్చేరి మధ్య జల రవాణా సర్వీసులను ప్రారంభించేందుకు ప్రాథమిక టెండర్ పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. చైన్నెలో రోడ్లు, వరద నీటి కాలువల పనులను రహదారుల శాఖ చేపడుతుందని, తిరువణ్ణామలై గిరివలయం మార్గం కోసం ప్రత్యేక రహదారి నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. క్రీడా రంగంలో ఒక స్పోర్ట్స్ సిటీ, 10 ప్రాంతాల్లో ఒలింపిక్ అకాడమీలు, ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ వేదికలను ఏర్పాటు చేయడంతో పాటు, చైన్నె నెహ్రూ స్టేడియంలో 25,000 నుంచి 30,000 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.


