ఓదార్పు మాటేదీ..?
– సెంజి చిన్నారి కుటుంబానికి కనిమొళి పరామర్శ
సాక్షి, చైన్నె: తమిళనాడు చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగిపోయాయని, స్వయంగా తన పాలనలోనే తాను సురక్షితంగా ఉంటాననే నమ్మకం సీఎం విజయ్‌కు లేకుండా పోయిందని డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సెంజి ప్రాంతంలో 35 రోజుల క్రితం అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారి హేమవతి కుటుంబాన్ని శనివారం ఆమె పరామర్శించారు. తల్లిదండ్రులను ఓదార్చిన అనంతరం కనిమొళి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. రెండో తరగతి చదువుతున్న హేమవతి, తన పుట్టినరోజు జరుపుకున్న మరుసటి రోజు ఉదయం నుంచి కనిపించకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి అదృశ్యమై 35 రోజులు గడిచినా, ఆ పాప ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. చిన్నారి కనిపించడం లేదని తల్లిదండ్రులు వెంటనే ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. నోబెల్ బహుమతి గ్రహీత కై లాష్ సత్యార్థి దాఖలు చేసిన 2013 నాటి కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఒక చిన్నారి కనిపించకుండా పోతే 24 గంటల్లోగా కిడ్నాప్ కేసుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, కేవలం మిస్సింగ్ కేసుగా నమోదు చేయకూడదని ఆదేశించిందన్నారు.అయితే, పోలీసులు ఇక్కడ మిస్సింగ్ కేసుగానే ఎందుకు నమోదు చేశారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ రెండూ సీఎం విజయ్ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఉన్నాయని కనిమొళి గుర్తుచేశారు. పిల్లలను మిత్రమా, మిత్రమా అని ఆప్యాయంగా పలకరిస్తూ, జాగ్రత్తగా ఇంటికి వెళ్లమని చెబుతూ ఓట్లు అడిగిన సీఎం , ఇప్పుడు ఆ పిల్లల రక్షణను గాలికొదిలేశారని మండి పడ్డారు.
సాక్షి, చైన్నె:తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరి ణామం శనివారం చోటుచేసుకుంది. పొల్లాచిలో జరిగిన ఓ వివాహ వేడుకలో రెవెన్యూ శాఖ మంత్రి సెంగోట్టయ్యన్, అన్నాడీఎంకే అసంతృప్తి సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్.పి. వేలుమణి పక్కన ఒకరు కూర్చుని సుదీర్ఘంగా ముచ్చటించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమిళగ వెట్రి కళగం ప్రభుత్వంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం ఉదయం పొల్లాచిలోని తారాపురం రోడ్డులో ఉన్న ఒక ప్రైవేట్ కల్యాణ మండపంలో మంత్రి సెంగోట్టయ్యన్ బంధువైన డాక్టర్ మురుగానందం కుటుంబ వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి వరుడి స్నేహితులైన మాజీ మంత్రి ఎస్.పి. వేలుమణి, మాజీ మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్, మాజీ ఎంపీ సి. మహేంద్రన్ హాజరయ్యారు. కాగా వివాహ వేడుకకు హాజరైన నలుగురు నేతలు గతంలో ఒకే పార్టీలో కలిసి పనిచేసినవారని, కేవలం పాత స్నేహం కొద్దీ మాత్రమే మాట్లాడుకున్నారని, ఇందులో రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశాయి.


