రామదాస్‌ కుమార్తె కొత్త రాజకీయ ప్రస్థానం | - | Sakshi
Sakshi News home page

రామదాస్‌ కుమార్తె కొత్త రాజకీయ ప్రస్థానం

Nov 15 2026 1:02 PM | Updated on Nov 15 2026 1:02 PM

– డిసెంబర్‌ 6న పార్టీ ఆవిష్కరణ

సాక్షి, చైన్నె : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పట్టాళి మక్కల్‌ కచ్చి (పీఎంకే) వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఎస్‌. రామదాస్‌ కుమార్తె శ్రీకాంతి కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారు. డిసెంబర్‌ 6వ తేదీన చైన్నెలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆవిష్కరణకు సంబంధించి విడుదల చేసిన ఆహ్వాన పత్రికలో కీలక వివరాలను ఆమె వెల్లడించారు. ‘పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్‌ కుమార్తె శ్రీకాంతి నాయకత్వంలో సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం అనే మూల సిద్ధాంతాల ఆధారంగా ఒక కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభమవుతోంది’ అని ఆహ్వానంలో పేర్కొన్నారు. సామాన్య ప్రజల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, సమగ్ర పురోగతే లక్ష్యంగా ఈ రాజకీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పీఎంకే కుటుంబం నుంచే మరో కొత్త రాజకీయ వేదిక తెరపైకి రావడం ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్‌ 6న చైన్నెలో జరగనున్న ప్రారంభోత్సవ సభలో పార్టీ పేరు, జెండా, భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

వివాదాల పయనం

ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య బయలు దేరిన రాజకీయ సమరం గురించి తెలిసిందే. ఈ సమయంలో తనకు పక్కబలంగా రాజకీయాలో ఉండేందుకు శ్రీకాంతిని రాందాసు తెరపైకి తెచ్చారు. ఆమెను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేశారు. ఆ ఎన్నికలను రాందాసు, అన్బుమణి శిబిరాలుగా పీఎంకే ఎదుర్కొంది. ఇందులో రాందాసు శిబిరం చతికిల బడగా, అన్బుమణి శిబిరం నుంచి ఆయన సతీమణి సౌమ్యతో పాటుగా పలువురు అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తదుపరి పరిణామాలతో తండ్రి, తనయుడుఏకమయ్యారు. రాందాసు రాజకీయాల నుంచి తప్పుకుని పార్టీని పూర్తిగా తనయుడు అన్బుమణికి అప్పగించేశారు. అయితే, శ్రీకాంతితో పాటుగా రాందాసును నమ్ముకుని అన్బుమణి ని తీవ్రంగావ్యతిరేకించిన వారు తాజాగా పీఎంకేకు దూరంగా ఉంటున్నారు. వీరంతా ఏకమైన శ్రీకాంతి ద్వారా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయిస్తున్నట్టు, పీఎంకే వన్నియర్‌ సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ గురి పెట్టి ఈ పార్ట్టీ ఆవిర్భావం జరగనున్నట్టు చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement