ఒప్పందాలపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

ఒప్పందాలపై దృష్టి

Oct 2 2026 3:09 AM | Updated on Oct 2 2026 3:09 AM

● 90 రోజులలో అప్పగింత ప్రక్రియ ● పునరుద్ధరణకు రూ. 6,600 కోట్లు

● 90 రోజులలో అప్పగింత ప్రక్రియ ● పునరుద్ధరణకు రూ. 6,600 కోట్లు

సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో దక్షిణ రైల్వే నియంత్రణలో ఉన్న ఈ ఎలివేటెడ్‌ రైలు సేవలు 1997 నుంచి అందుబాటులో ఉన్నాయి. ప్రారంభంలో చైన్నె బీచ్‌ నుండి వేళచ్చేరి వరకు 19 కిలోమీటర్ల మేరకు ఈ సర్వీసులు నడిచేవి. ఆ తర్వాత వేళచ్చేరి నుండి సెయింట్‌ థామస్‌ మౌంట్‌ (పరంగిమలై) వరకు విస్తరించి, ఈ ఏడాది మార్చి 15న ఆ మార్గంలో కూడి రైలు సేవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్‌ మొత్తం 23.98 కి.మీ మేరకు విస్తరించి ఉంది. ఈ మార్గంలో రోజూ దాదాపు లక్ష మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.

ప్రణాళికా వివరాలు

చైన్నె మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నిబంధనలకు అనుగుణంగా ఎంఆర్‌టీఎస్‌ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్‌ నాటికి ప్రాథమిక ప్రక్రియగా ఎంఆర్‌టీఎస్‌ స్టేషన్లను స్వాధీనం చేసుకుని, వివిధ కంపెనీలకు లీజుకు ఇచ్చే ప్రక్రియకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒప్పందం కుదిరిన తర్వాత రెండు సంవత్సరాలలోపు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎంఆర్‌టీఎస్‌ ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత మొత్తం వ్యవస్థను పూర్తిగా మెరుగుపరచడానికి మరో రెండేళ్ల సమయం కేటాయించనున్నారు. అదే సమయంలో ఉద్యోగులకు అందించాల్సిన పరిహారం లేదా వీఆర్‌ఎస్‌ ప్యాకేజీ వివరాలు, అలాగే ఆస్తుల బదిలీకి సంబంధించి దక్షిణ రైల్వేకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన తుది మొత్తంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

రూ. 6,600 కోట్లు అంచనా వ్యయం

పునరుద్ధరణ , ఆధునీకరణ కోసం సుమారు రూ. 6,600 కోట్లు అవసరమని అంచనా వేయగా.. ఈ ప్రాజెక్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఈ ఒప్పందంపై చైన్నె మెట్రో రైల్‌ అధికారులు మాట్లాడుతూ.. ఈ మార్గంలో మెరుగైన సౌకర్యాల కల్పనకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. రాబోయే 2 ఏళ్ల పాటు దక్షిణ రైల్వేనే రైళ్లను నడుపుతుందని పేర్కొన్నారు. ఈ సమయంలోనే ఏసీ రైళ్లు, ఆధునిక పార్కింగ్‌ సౌకర్యాలు, సిసిటివి కెమెరాలు, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ సౌకర్యాలు వంటివి ఏర్పాటు చేస్తామని వివరించారు.. 2 ఏళ్ల తర్వాత ఈ రైలు మార్గం పూర్తిగా కొత్త రూపంలో, అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఎంఆర్‌టీఎస్‌ పూర్తిగా మెట్రో గుప్పెట్లోకి వచ్చిన పక్షంలో ఉత్తర చైన్నె నుంచి దక్షిణ చైన్నె మీదుగా రవాణా వ్యవస్థ మరింత మెరుగు పడ్డట్టే. ఈ ఎంఆర్‌టీఎస్‌ మార్గం చైన్నె బీచ్‌ నుంచి వేళచ్చేరి మీదుగా పరింగి మలై వరకు వంతెనపై వెళ్తుండటం గమనార్హం. అందుకే ఈ మార్గాన్ని తమ గుప్పెట్లోకి త్వరితగతిన తీసుకునే దిశగా మెట్రో యాజమాన్యం కసరత్తులు వేగవంతం చేసింది.

ఒప్పందం కసరత్తు

ఎంఆర్‌టీఎస్‌ సేవలను మెట్రో యాజమాన్యానికి అప్పగించే పథకానికి రైల్వే బోర్డు జూలై 31, 2025న ప్రాథమిక (విధానపరమైన) ఆమోదం తెలిపింది. అలాగే, రైల్వే మంత్రిత్వ శాఖ కూడా రెండు నెలల క్రితం పూర్తి స్థాయిలో పచ్చజెండా ఊపింది. ఒప్పందం ప్రకారం, దక్షిణ రైల్వే తన ఆస్తులు, సాధారణ నిర్వహణ బాధ్యతలను (ప్రధాన రైలు రవాణా మినహా) 90 రోజుల్లోగా మెట్రోకు అప్పగిస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుండగా, రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ రైల్వే మధ్య అవగాహన ఒప్పందం సంతకాల ప్రక్రియపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు.

చైన్నెలోని ఫ్లయింగ్‌ ట్రైన్‌ (మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌– ఎంఆర్‌టీఎస్‌) మార్గాన్ని చైన్నె మెట్రో గుప్పెట్లోకి తీసుకు రానున్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై అధికారులు దృష్టి పెట్టారు. 90 రోజులలో అప్పగింత ప్రక్రియ దిశగా కసరత్తులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో పునరుద్దరణ పనులకు అంచనా వ్యయంగా రూ. 6,600 కోట్లు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement