– మరో 13 మందిపై కూడా
– కమిషనర్ అమల్‌రాజ్ ఆదేశాలు
సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో వరుస నేరాలు, హత్యలు, డ్రగ్స్ కేసులు, పోక్సో కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల అసాంఘిక కార్యకలాపాలను అణిచివేయడానికి చైన్నె నగర పోలీసు కమిషనర్ డాక్టర్ ఎ. అమల్‌రాజ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జెమ్ గ్రానైట్స్ వీరమణి పై గుండా చట్టం ప్రయోగించారు. అలాగే, మరో 13 మందిని గూండా చట్టం కింద అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. గత నెల ఐదో తేదీన శాస్త్రి నగర్, వణ్ణాన్ తురై ప్రాంతంలో కణ్ణన్ అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి హత్య చేసిన కేసులో సతీష్ కుమార్, మణికంఠన్, హరిహరన్, భరణిధరన్, రాకేష్‌లను అరెస్ట్ చేసి గుండా చట్టం ప్రయోగించి జైలుకు పంపారు. పోక్సో కేసు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసుకు సంబంధించి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నమోదు చేసిన పోక్సో కేసులో జెమ్ గ్రానైట్స్ పారిశ్రామికవేత్త వీరమణి, ఆయన సహచరులు శాంతి, మహేంద్ర సింహన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద తీవ్ర విచారణ కూడా జరిగింది. ఈ పరిస్థితులలో వీరి ముగ్గురిపై సైతం గుండా చట్టం ప్రయోగించారు. ఇక, సైదా పేట డ్రగ్స్ కేసు, వ్యాసార్పాడి హత్య కేసు, నార్త్ బీచ్ రోడ్డులో హత్యాయయత్నం కేసు, కొడుంగ యూర్‌లో హత్యాయయత్నం కేసు , పాత వన్నార్ పేటలో డ్రగ్స్ కేసులకు సంబంధించి శరత్, భరత్, విజయ్ అలియాస్ జాకీ, మదన్, గౌతం తదితర నిందితులను గూండా చట్టం కింద నిర్బంధించారు. నగరంలో ప్రజా శాంతికి భంగం కలిగించే వారు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.
టాస్మాక్ జీఎం సహా
16 మంది అధికారుల బదిలీ
సాక్షి, చైన్నె: తమిళనాడు వ్యాప్తంగా పలువురు కీలక అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా చైన్నె టాస్మాక్ జనరల్ మేనేజర్‌తో సహా మొత్తం 16 మంది జిల్లా రెవెన్యూ అధికారులను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయికుమార్ ఉత్తర్వులుజారీ చేశారు. గృహ, పట్టణాభివృద్ధి శాఖ జిల్లా రెవెన్యూ అధికారి పి. శైలేంద్రన్‌ను(భూసేకరణ) నుండి శివగంగ జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ చేశారు. చైన్నె కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ ఉమా మహేశ్వరి రామచంద్రన్ భూ పరిపాలన జాయింట్ కమిషనర్‌గా నియమించారు. చైన్నె టాస్మాక్ జనరల్ మేనేజర్ (సేల్స్) టి. ముత్తురామలింగంను చైన్నె మెట్రోపాలిటన్ మున్సిపాలిటీ జిల్లా రెవెన్యూ అధికారిగా (భూమి , ఎస్టేట్) బదిలీ చేశారు. విల్లుపురం హైవేస్ ప్రత్యేక జిల్లా రెవెన్యూ అధికారి డి. అంబయరా నందన్‌ను చైన్నె విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టు ప్రత్యేక జిల్లా రెవెన్యూ అధికారిగా నియమించారు. ఈ బదిలీలతో పాటు ఆరోగ్య వ్యవస్థ ప్రాజెక్ట్, సిప్‌కోట్, కన్స్యూమర్ గూడ్స్ కార్పొరేషన్ తదితర కీలక విభాగాలకు చెందిన మొత్తం 16 మంది అధికారులను వివిధ స్థానాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
టెట్ ఫలితాల విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
– స్టే ఎత్తివేత
సాక్షి, చైన్నె : ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ప్రత్యేక అర్హత పరీక్ష ఫలితాల విడుదలకు గతంలో విధించిన మధ్యంతర స్టేను మద్రాసు హైకోర్టు ఎత్తివేసింది. తక్షణమే ఫలితాలను విడుదల చేయాలని ఉపాధ్యాయ ఎంపిక బోర్డును ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు, మాధ్యమిక పాఠశాలల ప్రిన్సిపాల్స్ కోసం ఉపాధ్యాయ ఎంపిక బోర్డు గతేడాది జూలైలో ప్రత్యేక అర్హత పరీక్షను నిర్వహించింది. అయితే, తమకు అనుభవమున్న ప్రతి ఏడాదికి ఒక గ్రేస్ మార్కు కేటాయించాలని కోరుతూ ధర్మపురి జిల్లాకు చెందిన పి. నటరాజన్, ఎన్. సెల్వన్ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై ప్రభుత్వం తరపున విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలపడంతో, విచారణ జరిపిన కోర్టు జూలై 8న ప్రత్యేక పరీక్ష ఫలితాలపై మధ్యంతర స్టే విధించింది.
ప్రభుత్వ అభ్యర్థన అంగీకారం:ప్రధాన కేసు తుది విచారణకు సిద్ధంగా ఉన్నందున, ఫలితాల ప్రచురణపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఎం సుధీర్ కుమార్.. ప్రభుత్వ అభ్యర్థనను ఆమోదిస్తూ ఫలితాల విడుదలకు అనుమతినిచ్చారు. ఉపాధ్యాయులు కోరిన గ్రేస్ మార్కుల ప్రధాన కేసు విచారణను అక్టోబర్ 7వ తేదీకి కోర్టు వాయిదా వేశారు.


