నడిగర్‌ తిలగంకు నివాళులు | - | Sakshi
Sakshi News home page

నడిగర్‌ తిలగంకు నివాళులు

Oct 2 2026 3:09 AM | Updated on Oct 2 2026 3:09 AM

● సీఎం, మాజీ సీఎంల సందేశం ● ఆనందం వ్యక్తం చేసిన కుటుంబీకులు

మంత్రుల అంజలి

సాక్షి, చైన్నె: తమిళ సినీ నడిగర్‌ తిలగం శివాజీ గణేషన్‌ జయంతిని గురువారం అధికారిక వేడుకగా రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. ఆయన స్మారక మందిరంలో స్పీకర్‌, మంత్రులు నివాళులర్పించారు. శివాజీ కుటుంబ సభ్యులు అడయార్‌లోని స్మారక మండపంకు తరలి వచ్చి అంజలి ఘటించారు. తెలుగు సినీ రంగానికి ఎన్‌టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లు, తమిళ సినీలోకానికి ఎంజీఆర్‌, నడిగర్‌ తిలగం శివాజీ గణేషన్‌లు రెండు కళ్లు లాంటి వార అన్న విషయం తెలిసిందే. వీరంతా ఇప్పుడు ఈ లోకంలో లేరు. అయితే, వారి మదుర జ్ఞాపకాలు వెండి తెర వెలుగుల రూపంలో నేటికి దర్శనం ఇస్తున్నాయి. అదే సమయంలో అమరులైన వీరిని గౌరవించుకునే విధంగా ప్రభుత్వాలు ముందుకెళ్తోన్నాయి. ఆ దిశగా తమిళనాడు రాజధాని నగరం చైన్నెలో అత్యంత జన సంచారంతో నిండిన ప్రదేశం మెరీనా తీరంలో నడిగర్‌ తిలగంకు 2006లో విగ్రహాన్ని డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, ఆతదుపరి పరిణామాలతో ఆ విగ్రహంను అక్కడి నుంచి తొలగించి అడయార్‌కు మార్చారు. అడయార్‌లో గత పాలకుల నేతృత్వంలో స్మారక మందిరం రూపుదిద్దుకుంది. ఇక్కడ శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ పరిస్థితులలో గురువారం నడిగర్‌ తిలగం జయంతి కావడంతో స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌, ఆహార శాఖ మంత్రి వెంకటరమణన్‌, పాఠశాల విద్య, సమాచార శాఖ మంత్రి రాజ్‌ మోహన్‌, సామాజిక శాఖ మంత్రి వన్ని అరుసు తదితరులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి, చిత్రపటానికి పుష్పాంజలితో ఘనంగా నివాళులర్పించారు. ఇక, సీఎం విజయ్‌ , మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను దివంగత నడిగర్‌ తిలగం సినీ ప్రస్తానాన్ని గుర్తు చేస్తూ నివాళులర్పించారు.

శివాజీ గణేసన్‌ ప్రస్థానం

అక్టోబర్‌ 1, 1928న జన్మించిన శివాజీ గణేషన్‌కు చిన్నతనం నుంచే నటనపై మక్కువ ఎక్కువ. అప్పట్లో నాటకంలో ఆయన చేసిన అద్భుత నటనను చూసి మెచ్చి సినీ అవకాశాలు దరిచేరాయి. పరాశక్తి సినిమాతో అరంగేట్రం చేసిన ఆయన.. తమిళంలో 300కు పైగా చిత్రాలతో పాటు, హిందీ, తెలుగు, మలయాళ భాషా చిత్రాల్లోనూ నటించి నట తిలగం, నట చక్రవర్తిగా కోట్లాది అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారు. ఎన్నో మరపు రాని చారిత్రాత్మక చిత్రాలు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన అసాధారణ నటనకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులతో పాటు ఫ్రాన్స్‌ ప్రభుత్వపు షెవాలియర్‌ అవార్డు లభించాయని గుర్తు చేశారు. ఇక, సమాచార శాఖ కార్య దర్శి రాజారామన్‌, డైరెక్టర్‌ డా. అరుణ్‌ తంబురాజ్‌, శివాజీ కుమారులు రామ్‌కుమార్‌, ప్రభు తదితర కుటుంబ సభ్యులు, ప్రముఖ సినీ ప్రముఖులు ప్రభుత్వ అధికారులు తరలి వచ్చి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఇక, శివాజీ అభిమానులు సేవా కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement