న్యూస్‌రీల్
విజిల్ గుర్తుకు ఓటు వేయాలని సీఎం విజయ్ పిలుపు
మధురాంతకంలో ఎన్నికల ప్రచారం
వక్తిగత విమర్శలు వేదన కలిగించాయని ఉద్వేగం
ఓటర్లను ఆకర్షించే దిశగా ముందుకు
పాఠశాలలోనూ
భద్రత కరువు
సాక్షి,చైన్నె: వండలూరు సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన అఘాయిత్య ఘటనపై ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే యువజన నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాఠశాల ప్రాంగణాలు, మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పగటిపూట పాఠశాల ప్రాంగణం నుంచే విద్యార్థినిని అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడడం అత్యంత దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో దిగజారాయో ఈ సంఘటన స్పష్టం చేస్తోందని విమర్శించారు. సీఎం విజయ్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారనే కారణంతో పోలీసులు ఈ దారుణ ఘటనను అణచివేసేందుకు, కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాధితుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నారన్న వార్తలు ఆందోళనకరమని పేర్కొన్నారు. ఉప ఎన్నికల కోసమే ఈ దురాగతాలను దాచి పెట్టాలని చూస్తే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని తెలిపారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సాక్షి, చైన్నె : విజిల్ చిహ్నం చూపి ప్రతి ఓటరూ తమ హక్కును వినియోగించుకోవాలని సీఎం విజయ్ పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం మధురాంతకం నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీవీకే అభ్యర్థి మరకదం కుమారవేల్‌కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో పలు వ్యాఖ్యలు చేశారు. మాతృమూర్తులు, సోదరీముణుల గౌరవానికి భంగం కలిగేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వ్యక్తిగత విమర్శలపై ఆవేదన
గతంలో తన తల్లిని విమర్శించినా భరించానని, తమిళనాడులో తనకు అండగా ఉంటున్న మాతృమూర్తులు, సోదరీమణుల గౌరవానికి భంగం కలిగించేలా ప్రత్యర్థులు వ్యవహరిస్తున్న తీరును చూసి చలించిపోయానని సీఎం విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. ఇకమీదట వారిని కించపరిస్తే సహించేది లేదని, ఉపేక్షించబోనని హెచ్చరించారు. తమపై ఎలాంటి రాజకీయ విమర్శలు చేయలేక డీఎంకే నాయకత్వం దిగజారి ప్రవర్తిస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుటుంబం ఇటువంటి సంస్కృతిని చూస్తూ మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీకి రాష్ట్ర నుంచి ప్రధాన మద్దతు పార్టీగా డీఎంకే ఉందని ఆరోపించారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను సైతం కించపరిచేలా వ్యాఖ్యలు డీఎంకే చేసిందని గుర్తు చేశారు. వారిని ఆదరిస్తే, అసభ్య వ్యాఖ్యలు మారుమోగుతాయని, మహిళలను కించపరిచే వారిని వదలి పెట్టొద్దని, ఓటు అనే ఆయుధంతో బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
జెమ్ వీరమణి కేసు ప్రస్తావన
రాష్ట్రంలో కొద్ది రోజులుగా కలకలం సృష్టిస్తున్న జెమ్ వీరమణి లైంగిక వేధింపుల ఉదంతాన్ని విజయ్ తన ప్రసంగంలో లేవనెత్తారు. గత ప్రభుత్వాల హయాంలోనే ఈ దారుణాలు వెలుగు చూసినా అప్పట్లో వాటిని కప్పిపుచ్చారని ఆరోపించారు. మహిళలను రక్షిస్తామని ప్రగల్భాలు పలికిన గత డీఎంకే ప్రభుత్వం, ఇన్ని సంవత్సరాలుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిని వెనకేసుకు రావడం శోచనీయమన్నారు. ఈ దారుణాలపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఎందుకు నోరు మెదపడం లేదని సూటిగా ప్రశ్నించారు. బాధితుల నుంచి స్పష్టమైన ఫిర్యాదులు, వీడియో సాక్ష్యాలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తద్వారా నిందితులకు రక్షణ కల్పించారని ధ్వజమెత్తారు. ఈ దర్యాప్తును నీరుగార్చేందుకు కొందరు పోలీసు అధికారులు సైతం ప్రయత్నించారనే ఆరోపణలు రావడం విచారకరమని పేర్కొన్నారు.
ఓటర్లకు పిలుపు
మహిళల భద్రతను విస్మరించి, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్న డీఎంకే కూటమికి ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ గుర్తు అయిన విజిల్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఆయన ప్రచారాన్ని ముగించారు. ముందుగా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఆనంద్ ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా బరిలోకి దిగిన మరకదం కుమారవేల్ మధురాంతకం ప్రాంతానికి ఒక కొత్త ఆశాకిరణం అని వ్యాఖ్యలు చేశారు. ముందుగా సీఎం విజయ్ మధురాంతకంలో ఓటర్లను ఆకర్షించే దిశగా రోడ్ షోతో దూసుకెళ్లారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇక, బహిరంగ సభ జరిగిన వేదిక వద్దకు ఐదు వేల మందిని మాత్రమే కట్టుదిట్టమైన భద్రత నడుమ అనుమతించారు.


