మహిళా ఐపీఎస్‌లతో కూడిన బృందం నియామకం
విస్తృతంగా వీరమణి పోక్సో కేసు దర్యాప్తు
సీబీఐ విచారణ కోసం కోర్టులో పిటిషన్
దంపతుల వద్ద తీవ్ర విచారణ
సాక్షి, చైన్నె : మైనర్ బాలికలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెమ్ గ్రానైట్స్ యజమాని వీరమణి పోక్సో కేసు దర్యాప్తు కోసం తమిళనాడు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం ఒక ప్రత్యేక మహిళా దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ డీజీపీ మహేశ్‌కుమార్ అగర్వాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అదనపు పోలీస్ కమిషనర్ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) పి.సి.తేన్‌మొళి ఈ బృందానికి నేతృత్వం వహించనున్నారు. ఇందులో శాంతిభద్రతల జాయింట్ కమిషనర్ దిశా మిట్టల్, ఎస్పీ జె.ముత్తరసి, మహిళలు, పిల్లలపై నేరాల నివారణ డిప్యూటీ కమిషనర్ వి.వి.గీతాంజలి తదితర ఐపీఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ అమల్‌రాజ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో విచారణను కొనసాగించనుంది.
కేసు నేపథ్యం – పరిణామాలు
పేదరికంలో ఉన్న బాలికలను లక్ష్యంగా చేసుకుని లైంగిక దాడులకు పాల్పడిన ఆరోపణలతో 84 ఏళ్ల జెమ్ వీరమణితో పాటు ఆయన సహచరులు శాంతి, ఆమె భర్త మహేంద్ర సింహన్, అలాగే మాజీ ఉద్యోగి గణేశన్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది చోటు చేసుకున్న ఈ లైంగిక దాడి వ్యవహారాన్ని తాజాగా టీవీకే ప్రభుత్వం కీలకంగా భావించి విచారణను ముమ్మరం చేయించింది. ఇప్పటికే చైన్నె సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ విచారణ జరుపుతోంది. వీరమణిని కస్టడీకి తీసుకుని జరిపిన విచారణలో పలు విస్మయాన్ని కలిగించే అంశాలు బయటపడ్డాయి. గతంలో కేసును తుంగలో తొక్కేందుకు రూ.కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో తాజాగా ప్రత్యేక సిట్‌ను మహిళా ఐపీఎస్‌ల నేతృత్వంలో రంగంలోకి దించడం గమనార్హం. అదే సమయంలో ప్రాథమిక దర్యాప్తులో అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో చైన్నెలో పనిచేసిన కమిషనర్ అమల్‌రాజ్, అదనపు కమిషనర్ కన్నన్, ఏసీపీ ఎం.ఏ.యాస్మిన్ తదితర పోలీసు అధికారులపై శాఖాపరమైన బదిలీలు విచారణలు కొనసాగుతున్నాయి.
మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు
ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ సామాజిక మాధ్యమాలలో లీకై న బాధితుల వీడియోల విషయమై మద్రాస్ హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలైన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.ధర్మాధికారి, జస్టిస్ జి.అరుళ్మురుగన్‌తో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ఎన్.ఎల్.రాజా సీబీఐ విచారణ డిమాండ్ అప్పీల్‌ను ప్రస్తావించారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, పోలీసుల దర్యాప్తు కొనసాగనివ్వాలని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్ రూపంలో వస్తే విచారణకు స్వీకరిస్తామని తెలిపింది. అలాగే బాధితుల వీడియోలు సోషల్ మీడియాలో లీకవడంపై న్యాయవాది నివ్య వేరుగా జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ బెంచ్ ఎదుట ప్రస్తావించారు. పిటిషన్ దాఖలు చేస్తే విచారణకు స్వీకరిస్తామని కోర్టు పేర్కొంది. ఈ కేసులో అరెస్టయిన శాంతికి సంబంధించి అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చేస్తున్నాయి. ఈమెతోపాటుగా మహేంద్రను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు.
రాజకీయం వద్దు
జెమ్ వీరమణి కేసును రాజకీయ లబ్ధికోసం వాడుకోవద్దని మద్రాస్ హైకోర్టు హితవుపలికింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా అనవసర వ్యాఖ్యలు చేయవద్దని మంత్రులు, రాజకీయ పార్టీల నాయకులకు తగిన సలహాలు ఇవ్వాలని ఇరు పక్షాల న్యాయవాదులను ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో సరైన చర్యలు తీసుకోలేదంటూ మంత్రులు నిర్మల్ కుమార్, అధవ్ అర్జున సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఆరోపణలపై డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో పరస్పర విమర్శలు కొనసాగితే నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి దీన్ని రాజకీయం చేయడం మానుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి వీడియోలు, పుటేజీలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లేదా సోషల్ మీడియా వేదికలలో ప్రసారం చేయడం లేదా ప్రచురించడం చేయరాదని ఆదేశించింది.


