టెండర్ల కేటాయింపులో అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

టెండర్ల కేటాయింపులో అక్రమాలు

Sep 26 2026 12:14 AM | Updated on Sep 26 2026 12:14 AM

● 14 మందిపై డీవీఏసీ క్రిమినల్‌ కేసులు ●డీఎంకే వర్సెస్‌ వీసీకే ఫైట్‌

● 14 మందిపై డీవీఏసీ క్రిమినల్‌ కేసులు

సాక్షి, చైన్నె : టెండర్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడి లంచాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై మదురై కార్పొరేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌తో పాటు మొత్తం 14 మందిపై అవినీతి నిరోధక, నిఘా విభాగం (డీవీఏసీ ) అధికారులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. మదురై కార్పొరేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ ఆర్‌.రామస్వామి, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు వి.ఎస్‌.మణియన్‌, ఎం.బాలమురుగన్‌, కె.మైలేరినాథన్‌తో పాటు సాంకేతిక నిపుణులు, కార్యాలయ సిబ్బంది కలిపి మొత్తం 10 మంది ప్రభుత్వ అధికారులపై కేసు నమోదైంది. వీరితో పాటు నలుగురు కాంట్రాక్టర్లను కూడా నిందితులుగా చేర్చారు. కాంట్రాక్టర్ల నుంచి పెద్దఎత్తున లంచాలు వసూలు చేస్తున్నారనే పక్కా సమాచారంతో డీవీఏసీ అధికారులు చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయంలో మెరుపు దాడి చేశారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేకుండా ఉంచిన రూ.1.35 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3 కీలకమైన అసలు రికార్డులను, నిందితుల నుంచి లిఖితపూర్వక వాంగ్మూలాలను సేకరించారు. డీవీఏసీ ఇన్‌స్పెక్టర్‌ సూర్యకళ నేతృత్వంలో అవినీతి నిరోధక చట్టం కింద ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

పొన్ముడి పిటిషన్‌పై

ఈడీకి నోటీసులు

సాక్షి, చైన్నె : ఎరమ్రట్టి అక్రమ తవ్వకాల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి కె.పొన్ముడి, ఆయన కుమారుడు గౌతమ సికమణి దాఖలు చేసిన పిటిషన్‌పై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని మద్రాస్‌ హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ను ఆదేశించింది. 2006–2011 మధ్య డీఎంకే హయాంలో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్ముడిపై నిబంధనలకు విరుద్ధంగా ఎర్రమట్టి తవ్వకాలు జరిపి ప్రభుత్వానికి రూ.28.36 కోట్లకు పైగా నష్టం కలిగించారనే ఆరోపణలతో విల్లుపురం జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో గత ఏప్రిల్‌లో నిందితులందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు.

ఈడీ మనీలాండరింగ్‌ కేసు

ప్రధాన కేసులో వచ్చిన అక్రమ సంపాదనను హవాలా మార్గాన విదేశాల్లో పెట్టుబడి పెట్టారన్న ఆరోపణలపై ఈడీ మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసి చైన్నె సీబీఐ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అసలు కేసులోనే తాము నిర్దోషులుగా విడుదలైనందున, దానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసును కూడా కొట్టివేయాలని కోరుతూ పొన్ముడి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన కేసుకు సంబంధించిన తీర్పుపై అప్పీల్‌ చేయనున్నట్లు ఈడీ తరఫున న్యాయవాదులు తెలిపారు. పొన్ముడి దాఖలు చేసిన పిటిషన్‌పై రెండు వారాల్లోగా స్పందించాలని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.ధర్మాధికారి, జస్టిస్‌ జి.అరుల్‌మురుగన్‌ ధర్మాసనం ఈడీని ఆదేశించింది.

రసాభాసగా చైన్నె

కార్పొరేషన్‌ సమావేశం

సాక్షి, చైన్నె : చైన్నె కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో శుక్రవారం తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. వివిధ అంశాలపై డీఎంకే, వీసీకే మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, ఆరోపణలు చోటు చేసుకన్నాయి. ఇతర పార్టీల కౌన్సిలర్ల మధ్య సైతం వాగ్వాదం చోటుచేసుకోవడంతో సమావేశం రసాభాసగా సాగింది. కార్పొరేషన్‌ సమావేశంలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ చిత్ర పటాన్ని ప్రముఖ స్థానంలో, గాంధీ పక్కన ఉంచాలని వీసీకే, ఇతర సభ్యులు డిమాండ్‌ చేశారు. దీనిపై మేయర్‌ ప్రియ స్పందిస్తూ అందరినీ సమానంగా చూసే సమావేశ మందిరంలో అంబేడ్కర్‌కు తగిన గౌరవం ఇస్తున్నామని తెలిపారు. అదే సమయంలో డీఎంకే, వీసీకే సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో కొందరు సభ్యులు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. సమావేశంలో తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని, అధికారుల తీరు సరిగా లేదని కొందరు కౌన్సిలర్లు ఆరోపించారు. ప్రైవేట్‌ కాంట్రాక్టు కంపెనీలు కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకపోతే, కార్పొరేషనే నేరుగా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మేయర్‌ దృష్టికి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement