అమల్లోకి.. | - | Sakshi
Sakshi News home page

అమల్లోకి..

Sep 23 2026 12:25 AM | Updated on Sep 23 2026 12:25 AM

చైన్నెలో పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్‌

జిల్లా కేంద్రాల్లో మంత్రుల నేతృత్వంలో ప్రారంభోత్సవాలు

ప్రభుత్వ పాఠశాలల్లో పెరుంతలైవర్‌ కామరాజర్‌ అల్పాహార పథకం మంగళవారం అమల్లోకి వచ్చింది. ఈ విస్తరణ పథకాన్ని చైన్నెలో సీఎం విజయ్‌ ప్రారంభించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ తమ జిల్లాలు, నియోజకవర్గాలలోని ప్రభుత్వ,ప్రభుత్వ సహకారంతో నిర్వహణలో ఉన్న పాఠశాలలలో జరిగిన కార్యక్రమాలలో విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు.

సాక్షి, చైన్నె: తమిళనాడులోని ప్రభుత్వ ప్రభుత్వ సహాయం పొందే పాఠశాలల్లో విద్యార్థుల పోషకాహార స్థాయిని మెరుగుపరచడం, ఆకలితో బడికి వచ్చే పరిస్థితిని నివారించడం, విద్యపై వారు పూర్తి దృష్టి పెట్టేలా చేయడం లక్ష్యంగా.. పెరుంతలైవర్‌ కామరాజర్‌ అల్పాహార పథకం విస్తరణకు సీఎం ఎస్‌. జోసెఫ్‌ విజయ్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయం నుంచి ఇప్పటికే 1 నుండి 5వ తరగతి వరకు విజయవంతంగా అమలవుతున్న ఈ అల్పాహార పథకాన్ని, టీవీకే అధికారంలోకి వచ్చినానంతరం పెరుంతలైవర్‌ కామరాజర్‌ పేరుతో 6 నుండి 8వ తరగతులకు విస్తరించింది. ఈ విస్తరణ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అదనంగా ఉన్న 7,537 ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక పాఠశాలల్లోని 6 నుండి 8వ తరగతి చదువుతున్న దాదాపు 15.30 లక్షల మంది అదనపు విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కోసం అదనంగా రూ. 217.63 కోట్లు కేటాయించగా, మొత్తంగా ఈ పథకం కోసం రూ. 724 కోట్లు కేటాయించారు. దీంతో మొత్తం సుమారు 44,984 పాఠశాలల్లోని 1 నుండి 8వ తరగతి వరకు చదువుతున్న 34.64 లక్షల మందికి పైగా విద్యార్థులకు లాభం చేకూరనుంది.

సమీకృత వంటశాలలు

గ్రేటర్‌ చైన్నె కార్పొరేషన్‌ , ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని పాఠశాలలకు సమీకృత వంటశాలల ద్వారా నాణ్యమైన అల్పాహారం అందించబడుతుంది. గ్రామీణ ప్రాంతాలు , పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల కోసం తమిళనాడు మహిళా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా ఆయా పాఠశాలల్లోనే వేడివేడిగా అల్పాహారం తయారు చేసి అందించబడుతుంది. ఈ అల్పాహార పథకం విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారం, పాఠశాల హాజరును పెంచడమే కాకుండా, వారి విద్యా ప్రస్థానాన్ని మరియు సామాజిక పురోగతిని మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఉదయం చైన్నె తిరువాన్మియూర్‌లోని గాంధీగ్రామ్‌ మిడిల్‌ స్కూల్‌లో ఈ పథకం విస్తరణను ప్రారంభించిన సీఎం విజయ్‌.. విద్యార్థులతో కలిసి కింద కూర్చుని వారితో పాటు అల్పాహారం స్వీకరించారు.వారితో ముచ్చటించారు. పిల్లలకు వడ్డించారు. సరదాగా వారితో మాట్లాడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు ఎన్‌. ఆనంద్‌, ఆధవ్‌ అర్జున, రాజమోహన్‌, కె. జగదీశ్వరి, డా. ఆర్‌. కుమార్‌, శాసనసభ సభ్యుడు కె.వి. విజయ దాముతో పాటు ప్రధాన కార్యదర్శి డా. ఎం. సాయికుమార్‌, గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ, ధర్మేంద్ర ప్రతాప్‌ యాదవ్‌, ఎం. పల్లవి బల్దేవ్‌, జె. ఇన్నోసెంట్‌ దివ్య, జి.ఎస్‌. సమీరన్‌ తదితర ఉన్నతాధికారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

6 నుంచి 8 తరగతుల వరకు విస్తరణ

అల్పాహార పథకం ప్రారంభోత్సవంలో సీఎం

2వ రోజూ అధికారులతో భేటీ

రానున్న ఈశాన్య రుతుపవనాల సీజన్‌, ప్రస్తుత నైరుతీ రుతు పవనాల సీజన్‌లో వర్ష ప్రభావం, ముందు జాగ్రత్తలు, విపత్తు నిర్వహణ చర్యలు, జ్వరాల నివారణపై సీఎం వఎస్‌. జోసెఫ్‌ విజయ్‌ అధ్యక్షతన సచివాలయంలో అత్యున్నత స్థాయి అధ్యయన సమీక్షా సమావేశం మంగళవారం కూడా జరిగింది. ఇందులో కోయంబత్తూరు, దిండిగల్‌, ఈరోడ్‌, కరూర్‌, మధురై, నీలగిరి, శివగంగ, తెన్కాసి, తేని, విరుదునగర్‌ తదితర దక్షిణ, పశ్చిమ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. నీలగిరి, కోయంబత్తూరు, దిండిగల్‌, తేని జిల్లాల్లోని కొండ ప్రాంతాలలో భారీ వర్షాల వల్ల కొండచరియలు, మట్టి చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మందులు, ఫ్లూయిడ్‌ థెరపీ సదుపాయాలు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు సి.టి.ఆర్‌. నిర్మల్‌ కుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎం. సాయికుమార్‌ పాల్గొన్నారు.

కూవం నది పునరుద్ధరణ ప్రాజెక్ట్‌పై సమీక్ష

చైన్నె నగరంలో కీలకమైన కూవం నదిని దాని సహజ స్థితికి తీసుకురావడం, సుస్థిర పర్యావరణ పునరుద్ధరణను లక్ష్యంగా చేసుకుని చేపడుతున్న కూవం నది పునరుద్ధరణ ప్రాజెక్ట్‌పై సీఎం ఎస్‌. జోసెఫ్‌ విజయ్‌ అధ్యక్షతన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. 2026–2027 బడ్జెట్‌ ప్రకటనలో భాగంగా చైన్నె నదీ పునరుద్ధరణ ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో వివరణాత్మక ప్రాజెక్ట్‌ నివేదిక తయారీ, పనుల పురోగతి, అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలను పాటించడంపై చర్చించారు. చైన్నె నగర నదీతీర ప్రాంతాలను సుందరీకరించి, ప్రజలకు మెరుగైన ప్రజా ప్రదేశాలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన ఉద్దేశంగా ప్రకటించారు. ముందుగా సీఎం విజయ్‌తో జాతీయ షెడ్యూల్‌ తెగల కమిషన్‌ చైర్మన్‌ అంధర్‌ సింగ్‌ ఆర్య, సభ్యులు ఆశా లక్రా, జదోతు హుస్సేన్‌, సంయుక్త కార్యదర్శి అమిత్‌ నిర్మల్‌, డైరెక్టర్‌కల్యాణ్‌రెడ్డి తదితరులు భేటీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement