యూట్యూబర్‌ మారిదాస్‌పై మంత్రి ప్రభు పిటిషన్‌ | - | Sakshi
Sakshi News home page

యూట్యూబర్‌ మారిదాస్‌పై మంత్రి ప్రభు పిటిషన్‌

Sep 23 2026 12:25 AM | Updated on Sep 23 2026 12:25 AM

సాక్షి, చైన్నె: సోషల్‌ మీడియా వేదికగా తనపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేశారంటూ యూట్యూబర్‌ మారిదాస్‌పై తమిళనాడు ఖనిజ వనరుల శాఖ మంత్రి డి.కె. ప్రభు మద్రాస్‌ హైకోర్టులో కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ కేసు దాఖలు చేశారు. తమిళనాడు ఖనిజ వనరుల శాఖ మంత్రి , దంత వైద్యుడైన డి.కె. ప్రభు తరఫున ఈ పరువు నష్టం దావా న్యాయవాదులు కోర్టులో దాఖలు చేశారు. మారిదాస్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌ , సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా తనపై తప్పుడు, నిరాధారమైన అవినీతి ఆరోపణలు ప్రచారం చేస్తూ ప్రజల్లో తన రాజకీయ ప్రతిష్టను, వ్యక్తిగత పరువును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నాడని మంత్రి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల పరువు నష్టానికి గాను రూ. 1 కోటి నష్టపరిహారం చెల్లించేలా నిందితుడిని ఆదేశించాలని ఆయన కోరారు. మంత్రి డి.కె. ప్రభు దాఖలు చేసిన ఈ పరువు నష్టం పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.జి. తిలగవతి విచారించారు. అనంతరం పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణ నిమిత్తం దీనిని తగిన జాబితాలో చేర్చాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.

అసలు మోసపోయింది నేనే..!

– నటి రాధ ఆరోపణలపై నటి అంబిక ఆవేదన

సాక్షి, చైన్నె: ప్రముఖ నటి రాధ తనపై చేసిన మోసం ఆరోపణలపై ఆమె సోదరి, నటి అంబిక స్పందించారు. అసలు ఈ వ్యవహారంలో మోస పోయింది తానేనని తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. కమిషనరేట్‌లో రాధా ఫిర్యాదు నేపథ్యంలో ఈ వివాదంపై స్పందించిన నటి అంబిక ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ‘‘నిజానికి మోసపోయింది నేనే! నేనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. రాధకు ఎవరో తప్పుడు సలహా ఇచ్చారు. ఆమె ఎవరి ప్రభావంతో ఇలా చేసిందో నాకు తెలియదు కానీ, ఆమెను చూస్తే జాలి వేస్తోంది’’ అని అంబిక పేర్కొన్నారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బులో సగం అమ్మకు ఇచ్చామని పేర్కొంటూ, ఏఆర్‌ఎస్‌ అనేది అంబికా దేవర్‌ ఫిలిమ్స్‌ కుటుంబం నుండి కొనుగోలు చేసిన ఆస్తి అని, అది తాము కొన్న మొదటి ఆస్తిగా పేర్కొన్నారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి తానూ అండగా నిలిచాననని, దీని వెనుక చాలా చరిత్ర ఉందన్నారు. ఈ వివాదానికి సంబంధించి కొన్ని చట్టపరమైన సమస్యలు ఉన్నందున అన్ని విషయాలను బహిరంగంగా మాట్లాడలేనన్నారు. ఒకప్పుడు కుటుంబం కోసం అందరం కలసికట్టుగా ఆలోచించేవాళ్ల అని, అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా డబ్బు చుట్టూనే తిరుగుతోందని, సినిమా పరిశ్రమలో ఈరోజు డబ్బు మాత్రమే ప్రధానమైపోయిందని ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement