– ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
కొట్టివేతకు తిరస్కరణ
సాక్షి, చైన్నె: ఆదా యానికి మించిన ఆస్తుల కేసు నుంచి తనను విడుదల చేయాలని కోరుతూ మాజీ మంత్రి ఎం.ఆర్.కె. పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. 2006 నుంచి 2011 వరకు మంత్రిగా పనిచేసిన కాలంలో, తన ఆదాయానికి మించి రూ. 3 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణలపై ఆయనపై 2011లో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కడలూరు కోర్టు గతంలో ఆయనను, ఆయన కుటుంబాన్ని నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ అవినీతి నిరోధక శాఖ మద్రాసు హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయగా, కడలూరు కోర్టు ఇచ్చిన విడుదల ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. దీనిపై పన్నీర్‌సెల్వం మళ్లీ పిటిషన్ దాఖలు చేయగా, దానిని కడలూరు కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ బెంచ్, పన్నీర్‌సెల్వం అభ్యర్థనను తిరస్కరించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను కడలూరు కోర్టు నుంచి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
మనీలాండరింగ్ కేసులో న్యాయవాది అరెస్ట్
సాక్షి, చైన్నె : మానవ హక్కుల కమిషన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడిన కేసులో అరెస్ట్ వారెంట్ ఎదుర్కొంటున్న చైన్నెకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాదిని కోయంబత్తూరు సీబీసీఐడీ పోలీసులు పళనిలో అరెస్టు చేశారు. చైన్నెకి చెందిన శరవణన్ కరుప్పస్వామి (45) సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుండగా.. తాను విశ్వ మానవ హక్కుల కమిషన్ భారత ప్రతినిధినని చెప్పుకుంటూ పలువురిని మోసం చేశాడు. కమిషన్‌లో ఉన్నత పదవులు ఇప్పిస్తామంటూ చైన్నె, కోయంబత్తూరు ప్రాంతాల్లో నిరుద్యోగులు, అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు 2008లోనే సీబీసీఐడీ పోలీసులు శరవణన్ కరుప్పస్వామిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోయంబత్తూరు కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ, సాక్షుల విచారణ దశలో ఉండగా.. అతను బెయిల్‌పై బయటికి వచ్చాడు. అయితే విచారణ సమయంలో నిందితుడు పదే పదే కోర్టుకు గైర్హాజరు కావడంతో, న్యాయమూర్తి అతనికి నాన్–బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. అతను కుటుంబంతో కలిసి పళనిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో రహస్యంగా బస చేసినట్లు పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన కో యంబత్తూరు సీబీసీఐడీ ప్రత్యేకబృందం సోమ వారం రాత్రిపళని చేరుకున్నారు. సమగ్ర విచారణతో మంగళవారం ఉదయం హోటల్‌లో తనిఖీ లు చేసి శరవణన్ కరుప్పస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం ఆయన్ని కోయంబత్తూరుకు తరలించారు.
తుమ్మ చెట్ల తొలగింపు కోసం..
సాక్షి, చైన్నె: తమిళనాడు వ్యాప్తంగా పర్యావరణానికి హాని కలిగిస్తున్న సీమై కరువేల (తుమ్మ చెట్లు) చెట్ల తొలగింపు పనులను పర్యవేక్షించేందుకు మద్రాస్ హైకోర్టు నియమించిన విశ్రాంత న్యాయమూర్తి వి. భారతిదాసన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు ప్రకటించిన నెలవారీ రూ. 3 లక్షల గౌరవ వేతనాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. తమిళనాడులో సీమై కరువేల చెట్లను పూర్తిగా తొలగించాలని కోరుతూ ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో సహా పలువురు మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన పర్యావరణ, అడవులు , వన్యప్రాణుల కేసుల ప్రత్యేక ధర్మాసనం.. రాష్ట్రంలో ఈ చెట్లను తొలగించాలని ఆదేశించడంతో పాటు, పనుల పర్యవేక్షణకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తులు ఎ. సెల్వం, వి. భారతిదాసన్‌లను నియమించింది. వీరికి నెలసరి గౌరవ వేతనంగా రూ. 3 లక్షలు చెల్లించాలని కూడా కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో విశ్రాంత న్యాయమూర్తి వి. భారతిదాసన్.. పర్యావరణ శాఖ కార్యదర్శి కాకర్ల ఉషకు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో, ‘‘సీమై కరువేల చెట్ల తొలగింపును పర్యవేక్షించినందుకు ప్రభుత్వం నాకు కేటాయిస్తున్న రూ. 3 లక్షల గౌరవ వేతనాన్ని నేను స్వీకరించదలచుకోలేదు. ఆ మొత్తాన్ని రాష్ట్రంలో సీమై కరువేల చెట్ల తొలగింపు పనులకే వినియోగించండి’’ అని ఆయన కోరారు. కాగా, సీమై కరువేల చెట్ల నిర్మూలన కోసం జిల్లా ఖనిజ నిధి నుంచి రెండు వారాల్లోగా రూ. 5 కోట్లు కేటాయించాలని గతంలో మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం గమనార్హం. విశ్రాంత న్యాయమూర్తి తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.


