నల్ల మిరియాలు, యాలకులు సాగులో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

నల్ల మిరియాలు, యాలకులు సాగులో ప్రతిభ

Sep 23 2026 12:25 AM | Updated on Sep 23 2026 12:25 AM

● ప్రధాని మోదీకి యువ శాస్త్ర వేత్త డా. ఆర్‌. శ్రీలక్ష్మి లేఖ ● ఉద్యానవన చట్టానికి వినతి

సాక్షి, చైన్నె : భారతదేశంలో సుగంధ ద్రవ్యాల సాగును లాభసాటిగా మార్చడంతో పాటు, ప్రపంచ మార్కెట్‌లో దేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు కొత్త సాంకేతికతతో ఉద్యానవన చట్టం తీసుకు రావాలని కోరుతూ ప్రముఖ పరిశోధకులు డా. ఆర్‌. లక్ష్మి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో యువ శాస్త్ర వేత్తగా పలు పరిశోధనలతో ముందుకు సాగుతున్న డాక్టర్‌ఆర్‌ లక్ష్మి నల్ల మిరియాలు, యాలకులు , లవంగాల సాగులో విప్లవాత్మక మార్పులుతీసుకొచ్చినట్టు వివరించారు.

సాంప్రదాయ సాగులో ప్రధాన సమస్యలు:

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌ నర్సరీల ద్వారా సరఫరా అవుతున్న మిరియాల మొక్కలలో నెమటోడ్‌ విల్ట్‌, క్విక్‌ విల్ట్‌, బాక్టీరియల్‌ విల్ట్‌ వంటి ఆశించడంతో సుమారు 30% నుండి 40% మొక్కలు నాటిన వెంటనే చనిపోతున్నాయని వివరించారు. సాంప్రదాయ పద్ధతిలో పెరిగే మిరియాల తీగలు 30 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుండటం వల్ల, తుఫానులు , ఈదురుగాలుల సమయంలో వేళ్లతో సహా పెకిలించబడి రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్నొన్నారు. ఈ దృష్ట్యా, దిగుబడి భారీగా పడి పోయినట్టు వివరించారు.

కొత్త ఆవిష్కరణలు – ప్రయోజనాలు:

ఉత్తమ జన్యు పదార్థంతో మైక్రోప్రొపగేషన్‌ పద్ధతిలో అభివృద్ధి చేసిన మొక్కలు 95% పూర్తిగా వ్యాధి రహితంగా ఉంటాయని, ఇవి నెలకు ఒక అడుగు చొప్పున వేగంగా పెరుగుతాయన్నారు. 30 అడుగుల బదులుగా ఈ మొక్కలను కేవలం 7 అడుగుల ఎత్తులోనే ఉంచి సురక్షితంగా పంట కోయవచ్చు అని, ఐదవ సంవత్సరం నాటికి ఎకరానికి (1,200 మొక్కలు) రూ. 1,50,000 వరకు నికర లాభం వస్తుందని వివరించారు. ఈ క్రమంగా 10వ సంవత్సరం నాటికి ఈ లాభం సుమారు రూ. 27 లక్షలకు పెరుగుతుందన్నారు. ఈ చెట్లు 30 నుంచి 35 సంవత్సరాల పాటు నిలకడగా కాస్తాయన్నారు. నెమటోడ్‌ వ్యాధి నివారణ కోసం కిలోగ్రాముకు 12 కోట్ల సీఎఫ్‌యూ కలిగిన శక్తివంతమైన బయో–ఫార్ములేషన్‌ను రూపొందించామన్నారు.. దీనిని పిచికారీ చేయడం ద్వారా కేవలం 15 రోజుల్లో వ్యాధి సోకిన మొక్కలు పూర్తిగా కోలుకుంటాయన్నారు.

పుదుచ్చేరిలో ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌

పుదుచ్చేరిలోని ప్రతి గ్రామంలో 15 మంది మహిళలకు 15 మిరియాల తీగలను ఉచితంగా అందించి, వారి ఆర్థిక అభివృద్ధిని నిరూపించడానికి ఒక ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు , ఉద్యానవన రంగాన్ని క్రమబద్ధీకరించడానికి జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక ఉద్యానవన చట్టం తీసుకురావాలని కోరారు. మిరియాలు, యాలకులు, లవంగాల సాగులో భారతదేశం ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకునేలా ఈ కొత్త సాంకేతికతను, బయో–ఫార్ములేషన్‌ను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement