సాక్షి, చైన్నె: ప్రయాణికుల సౌకర్యార్థం చైన్నె డివిజనన్ పరిధిలోని 118 రైల్వే స్టేషన్లలో వీల్‌చైర్ సౌకర్యాలను కల్పించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వయోవృద్ధులు, దివ్యాంగులు , నడవలేని ప్రయాణికులకోసం ఈ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. చైన్నె ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ఆధునీకరణ, పునరుద్ధరణ పనుల కారణంగా.. పూందమల్లి హైవే వైపు నుంచి ప్లాట్‌ఫాంలకు వీల్‌చైర్లు, నాలుగు చక్రాల వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులు గాంధీ ఇర్విన్ రోడ్ వైపు నుంచి ఈ వాహనాల ద్వారా అన్ని ప్లాట్‌ఫారమ్‌లకు చేరుకోవచ్చు. కొత్త పాదచారుల ఓవర్‌పాస్ అందుబాటులోకి వచ్చే వరకు ఈ తాత్కాలిక ఏర్పాట్లు అమల్లో ఉంటాయి.
సహాయం పొందే విధానం..
వీల్‌చైర్ లేదా పోర్టర్ల సహాయం అవసరమయ్యే వయోవృద్ధులు, ప్రయాణికులు స్టేషన్ మేనేజర్ లేదా సంబంధిత స్టేషన్ అధికారులను సంప్రదించడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు. పోర్టర్ల సేవల వివరాలు, వారికి చెల్లించాల్సిన నిర్దేశిత ఛార్జీల వివరాలను స్టేషన్ ప్రాంగణంలో ప్రముఖంగా ప్రదర్శిస్తారు. ఎగ్మోర్ స్టేషన్‌లో గాంధీ ఇర్విన్ రోడ్, పూందమల్లి రోడ్ వైపులను అనుసంధానిస్తూ 18 మీటర్ల వెడల్పుతో భారీ పాదచారుల ఓవర్‌పాస్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇందులో 6 ఎస్కలేటర్లు, 5 ఎలివేటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని అంచనా. కాగా, తాంబరం రైల్వే స్టేషన్‌లోనే వివిధ ప్రాంతాలలో ప్రయాణికుల కోసం 13 వీల్‌చైర్లను సిద్ధంగా ఉంచారు. చైన్నె సెంట్రల్, ఎగ్మోర్, మాంబళం, పరంగిమలై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, అరక్కోణం, తిరుత్తణి, కాట్పాడి, జోలార్‌పేట్ తదితర ప్రధాన స్టేషన్లలోనూ ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా తగినన్ని వీల్‌చైర్లు అందుబాటులో ఉంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు.


