పోడియం ఎదుట బైఠాయింపు
సాక్షి,చైన్నె:సీఎం విజయ్ అసెంబ్లీలో డీఎంకేను టార్గె ట్ చేశారు. డీఎంకే దివంగత నేత కరుణానిధి, మాజీ సీఎం ఎంకే స్టాలిన్, ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయనిధి స్టాలిన్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీల పేర్లను ఉచ్చరిస్తూ అవినీతికి కేరాఫ్ అడ్రస్సుగా ఆ పార్టీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చారు. సీఎం తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ వ్యాఖ్యలు చేయడంతో ప్రతి దాడిగా డీఎంకే సభ్యులందరూ లేచి నిలబడి ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ జేసీడీ ప్రభాకర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఓ వైపు డీఎంకే వర్గాలు లేచి నిలబడి నిరసనలు తెలుపుతుంటే, మరో వైపు సీఎం విజయ్ ఏ మాత్రం తగ్గకుండా గత డీఎంకే పాలనలో జరిగిన వీరాణం తాగునీటి పథకంలో సర్కారియా కమిషన్ నివేదికను ఉటంకిస్తూ నాటి నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పార్టీ నిధుల పేరిట కమిషన్లు తీసుకున్నారని, దీని ద్వారా ఎం.కె. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ లబ్ధి పొందినట్లు ఈడీ ఆధారాలు ఉన్నాయని వివరించారు.
సభలో తీవ్ర గందరగోళం – డీఎంకే వాకౌట్
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సహా డీఎంకే సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సీఎం ప్రసంగానికి సమాధానం ఇచ్చేందుకు తమకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. ప్రతిపక్షం కావాలనే సీఎం ప్రసంగాన్ని అడ్డుకుంటోందని, సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వలేనని స్పీకర్ జే.సి.డి. ప్రభాకర్ స్పష్టం చేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో అసెంబ్లీ నేత సెంగోట్టయ్యన్ స్పందిస్తూ, డీఎంకే వర్గాలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు సూచించారు. అదే సమయంలో సీఎం విజయ్ కల్పించుకుని వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ, డీఎంకే సభ్యుల నిరసన కొనసాగడంతో స్పీకర్ తన నిర్ణయానికే కట్టుబడ్డారు. స్పీకర్ తీరుకు నిరసనగా డీఎంకే సభ్యులందరూ సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు.వారి వెన్నంటి మనిదనేయమక్కల్ కట్చి, మనిదనేయ జననాయగ కట్చి, కొంగునాడు దేశీయ కట్చిలు సైతం వాకౌట్ చేశాయి. కాగా స్పీకర్ పోడియం ముట్టడి సమయంలో డీఎంకే ఎమ్మెల్యే దురై చంద్రశేఖర్ కాలు జారి కింద పడ పోగా, సీఎం విజయ్ చటుక్కున లేచి ఆయన్ని పట్టుకున్నారు. ఇక, సభలో ఈ తంతు అంతా జరుగుతుంటే, అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేత పళణి స్వామి పదే పదే చిరు మందహాసంతో కనిపించడం గమనార్హం.
స్పీకర్ వైఖరిపై అసంతృప్తి
సీఎం ప్రసంగానికి స్పీకర్ భజన చేస్తున్నారని , సీఎం మాట్లాడినానంతరం తమకు అవకాం ఇస్తామన్న స్పీకర్, చివరకు ఒక చీటీ చూడగానే మాటమార్చి అవకాశం ఇవ్వలేదని కరాఖండిగా తేల్చిచెప్పడం శోచనీయమన్నారు. సోమవారం సమాధానం చెప్తానని చెప్పి పరుగు పందెం లాగా పారిపోయిన సీఎం విజయ్, తాజాగా బట్టీ పట్టి వచ్చి ఒప్పజెప్పే పోటీ లాగా అసెంబ్లీలో తప్పుడు ఆరోపణలు చేశారని ఎద్దేవా చేశారు.
ప్రత్యక్ష సవాల్
ఈడీ సహా తమపై మోపిన కేసులను చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమ నేత నెహ్రూ ఇంట్లో తనిఖీలు చేసి ఏమీ దొరకలేదని అధికారులు చెప్పి వెళ్లారని వివరించారు. కోడనాడ్ వెళ్లి తన సినిమా విడుదల కోసం వాచ్‌మ్యాన్ ఉద్యోగం చేసిన చరిత్ర మన ప్రస్తుత ముఖ్యమంత్రికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. భవిష్యత్‌లో ఈ ప్రభుత్వానికి తమిళనాడు ప్రజలు తగ్గిన బుద్ధి చెబుతారని, ఇప్పుడు వీర్రవీగుతుండే నాయకులకు తగిన సమాధానమిస్తామని హెచ్చరించారు.
మొన్న పరుగు పందెం.. నేడు వక్తృత్వ పోటీ : ఉదయ నిధి
అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన ఉదయ నిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ,తమిళనాడు అసెంబ్లీలో శాంతిభద్రతల సమస్యపై డిఎంకె అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సీఎం విజయ్ కేవలం పంచ్ డైలాగ్స్‌తో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. అదే యాక్టింగ్, అవే పంచ్ డైలాగ్స్. సీఎం విజయ్ కేవలం సామాజిక మాధ్యమాల రీల్స్ కోసమే అసెంబ్లీలో మాట్లాడి వెళ్లారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను బట్టీ పట్టి వచ్చి సభలో వీరావేశంతో చదవి వినిపించారు. సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటు అని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం వద్ద ఎలాంటి సమాధానం లేదని, అందుకే పంచ్ డైలాగ్స్ చెప్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్నారు.


