– డీఎంకే, అన్నాడీఎంకే కార్పొరేటర్‌ల మధ్య మాటల యుద్ధం
వేలూరు: వేలూరు కార్పొరేషన్ సమావేశం సోమవారం మేయర్ సుజాత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ రమేష్ మాట్లాడుతూ తన వార్డులో భూగర్బ డ్రైనేజి పనుల కోసం తవ్యిన కాలువలు పూర్తిగా మట్టి పోసి పూడ్చక పోవడంతో వర్షం వస్తే పూర్తిగా బురదమయంగా మారుతుందన్నారు. అదేవిధంగా తారు రోడ్డులను పూర్తిగా ద్వంసం చేసి మట్టిరోడ్డు తరహాలో తయారు చేశారన్నారు. వీటిని స్థానిక ఎమ్మెల్యే కూడా తనిఖీ చేసి ఏం చేయకుండా వదిలి పెట్టారన్నారు. అదే విధంగా కార్పొరేషన్ మొదటి జోన్ చైర్మన్ పుష్పలత మాట్లాడుతూ గతంలో వేలూరులో సేకరించే చెత్తను వేలూరులోనే పెట్టేవారని ప్రస్తుతం వేలూరులో సేకరించే చెత్త పూర్తిగా కాట్పాడి ప్రాంతానికి తీసుకు రావడం ఎందుకని ప్రశ్నించారు. కాట్పాడిలో ఎక్కడబడితే అక్కడ కార్పొరేషన్ సిబ్బంది చెత్తను వేస్తున్నా వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. వీటిపై కమిషనర్ ఫాతిమా వీటిపై విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. అన్నాడీఎంకే కార్పొరేటర్‌లు మాట్లాడుతుండగా డీఎంకే కార్పొరేటర్లు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మద్య మాటల యుద్ధం జరిగింది. కమిషనర్ వీటిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సమావేశం సద్దుమణిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, కార్పొరేటర్‌లు, అధికారారులు పాల్గొన్నారు.


