హత్యకు గురైన కన్నన్, హత్య చేస్తున్న దృశ్యాలు
సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో అత్యంత కీలక ప్రదేశంగా ఉన్న బీసెంట్ నగర్ బీచ్ సమీపంలోని శాస్త్రి నగర్‌లో శనివారం అర్థరాత్రి తీవ్ర కలకలం నెలకొంది. గతంలో అన్నాడీఎంకేలో పనిచేసి, తాజాగా అధికార తమిళగ వెట్రి కళగంలో చేరిన కన్నన్ అనే స్థానిక నాయకుడిని అతి దారుణంగా ప్రత్యర్థులు నరికి చంపారు. రాజధాని నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై రాజకీయంగా కలకలం బయలు దేరింది. ఇదేనా శాంతి భద్రతల పరిరక్షణ అని ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయ నిధి స్టాలిన్ ప్రశ్నించారు. వివరాలు.. శాస్త్రి నగర్ వన్నార్ పేటకు చెందిన కన్నన్ శనివారం రాత్రి సమయంలో వాసంతరై ప్రాంతం వైపు వెళ్తుండగా, కత్తులతో దాగి ఉన్న ఆరుగురు రౌడీలు చుట్టుముట్టారు. రౌడీల నుంచి తప్పించుకోవడానికి కన్నన్ పరుగు తీసినప్పటికీ, వెంటాడి విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన కన్నన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న శాస్త్రి నగర్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపిన ప్రత్యేక పోలీసులు, పథకం ప్రకారం హత్యకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
పాత కక్షలే కారణమా?
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న కన్నన్‌పై గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయని, తిరువాన్మియూర్ ప్రాంతంలో జరిగిన హత్యకు ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజకీయం, వ్యాపారం తదితర కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
రాజకీయ రగడ
కన్నన్ హత్య వార్త తెలిసి ఆయన బంధువులు, మద్దతుదారులు ఘటన స్థలంకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో ఆ పరిసరాలలో కలకలం రేగింది. రాజధాని చైన్నె రోడ్లపై శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రౌడీలు నడిరోడ్డుపై హత్యలకు తెగబడుతున్నారని ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదేనా తమిళనాడులోని సీఎం విజయ్ న్యాయం–శాంతిభద్రతల పరిస్థితి అని విమర్శించారు. అధికార పార్టీకి చెందిన ఓ స్థానిక నేత దారుణంగా నరికి చంపబడటంపై బట్టి చూస్తే, ఇక సామాన్యులకు ఏదీ భద్రత అని ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉన్న విజయ్ అసెంబ్లీలో పోలీస్ శాఖ పద్దుపై సమాధానం ఇవ్వడానికి ఒక్క రోజు ముందు, ఆయన స్వంత పార్టీకి చెందిన నేతే రాజధాని నడిబొడ్డున వీధిలో వెంటాడి నరికి చంపబడటం దారుణమని పేర్కొన్నారు. తన ప్రాణ రక్షణ కోసం అధికార టీవీకే పార్టీలో చేరిన ఒక రౌడీ షీటర్‌ను రోడ్డుపై వెంటాడి చంపారని, నేర చరిత్ర ఉన్న రౌడీలందరికీ స్థావరంలా టీవీకే మారిపోవడం విచారకరమన్నారు.


