సాక్షి, చైన్నె: రామనాథపురం జిల్లా రామేశ్వరం వచ్చే పర్యాటకులు, ఆధ్యాత్మిక భక్తులు సముద్ర మార్గంలో ప్రయాణిస్తూ పాంబన్ రైల్వే వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్, రోడ్డు వంతెనల అందాలను, సముద్ర సౌందర్యాన్ని వీక్షించేందుకు వీలుగా ప్రయాణీకుల పడవ రవాణాను ప్రారంభించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తమిళనాడు మేరిటైమ్ బోర్డు అధికారులు సన్నాహక పనులను వేగవంతం చేశారు.
సర్వే వివరాలు..
రామేశ్వరంలోని అగ్నితీర్థం తీరం నుండి బయలు దేరి పాంబన్ బ్రిడ్జ్, సముద్ర కాలువ మీదుగా మండపం వరకు పడవ సర్వీసును నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అగ్నితీర్థం నుండి మండపం వరకు సముద్ర మార్గం దూరం, నీటి లోతు, పాంబన్ వర్టికల్ లిఫ్ట్ వంతెన కింద పడవ ప్రయాణానికి అవసరమైన ఎత్తు తదితర అంశాలను రామేశ్వరం పోర్ట్ ఆఫీసర్ కెప్టెన్ మేనక్సా, చైన్నె మేరిటైమ్ బోర్డు సలహా కమిటీ బృందం పరిశీలించాయి. ఈ ప్రాథమిక తనిఖీల ఆధారంగా త్వరలోనే అగ్నితీర్థం – మండపం మధ్య కొత్తగా ప్రయాణీకుల పడవ రవాణా సేవలను ప్రారంభించడానికి పనులు వేగవంతం చేస్తామని అధికారులు వెల్లడించారు.


