చైన్నె: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనలపై సమాధానం చెప్పడానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సిద్ధంగా ఉన్నప్పుడు, సభకు రాకుండా పారిపోయింది కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీనేనని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ విమర్శించారు. ఆయన శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను చూసి పారిపోతున్నారు అని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉందన్నారు. ప్రత్యక్షంగా చర్చించే ధైర్యం లేక సభకు రాకుండా పారిపోయింది రాహుల్ గాంధీనే అని, ఇది దేశమంతటికీ తెలుసని హితవుపలికారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే అత్యంత కీలక సమయంలో కూడా విదేశాలకు విహార యాత్రలకు వెళ్లే ఒక పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడిని నాయకుడిగా పెట్టుకుని మీరు ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు ఎంతగా అసహ్యించుకుంటున్నారో తెలుసుకోవడానికి 2014 నుంచి 2024 వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను గూగుల్ చేసి చూస్తే సరిపోతుందన్నారు. అంతకంటే పెద్ద ఆధారం ఇంకేం కావాలి? అని సూచించారు.
వైఫై, సీసీటీవీ సౌకర్యాలతో ఆధునిక బస్ షెల్టర్లు
సాక్షి, చైన్నె : చైన్నె కార్పొరేషన్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం రూ.1.14 కోట్లతో 6 కొత్త ఆధునిక బస్ షెల్టర్లను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటిలో ఉచిత వైఫై, సీసీటీవీ నిఘా కెమెరాలు, వేసవి, వర్షాకాలంలో తట్టుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. వీటిని జోన్ 4 (తండయార్‌పేట), పెరంబూర్, శర్మనగర్, ఎరుకంచేరి హైవే, సిడ్కో నగర్ మెయిన్ రోడ్, ఎస్‌ఎమ్‌నగర్ మెయిన్ రోడ్, ఎం.కె.బి.నగర్ జంక్షన్ ప్రాంతాల్లో నిర్మించనున్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి సర్వీసింగ్ పర్యవేక్షణ ఉంటుంది. రాత్రిళ్లు ప్రయాణించే మహిళల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఓనం సంబరాలు ప్రారంభం
సాక్షి, చైన్నె : చైన్నె గ్రీమ్స్ రోడ్‌లోని కేరళ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కేటీడీసీ) ప్రాపర్టీ అయిన రెయిన్ డ్రాప్స్‌లో ఓనం పండగ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను శుక్రవారం ఉదయం రాజ్యసభ సభ్యులు ప్రవీణ్ చక్రవర్తి ప్రారంభించారు. తొలి పొన్నోణ సద్య కూపన్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త, నటుడు డాక్టర్ ఎ.వి.అనూప్‌కు అందజేశారు. కార్యక్రమంలో మోహనన్, అన్వర్, కల్పక గోపాలన్, నందగోవింద్, రవి, ఆనందన్ , రెయిన్ డ్రాప్స్ జనరల్ మేనేజర్ అను చాకో పాల్గొన్నారు.


