తమిళ సినిమా: దక్షణాది సినిమా మరో మహానటిని కోల్పోయి శోకసముద్రంలో మునిగిపోయింది. నటి షావుకారు జానకి(94) శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చైన్నెలో కన్నుమూశారు. ఆమె వృద్ధాప్యంతోపాటు శ్వాస సమస్యతో బాధపడుతూ ఆల్వార్‌పేటలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందారు. సినిమా ఆమెను షావుకారు జానకిని చేసింది. తొలి చిత్రంతోనే చిత్రం పేరు తన పేరు ముందు చేరడం విశేషం. షావుకారు జానకి అద్భుత నటనకు చిరునామా. ఆమె ఆంధ్రప్రదేశ్, రాజమండ్రిలో 1931 డిసెంబరు 12వ తేదీన వెంకోజీరావు, సచ్చుదేవిలకు జన్మించారు. ప్రాథమిక విద్యను అసోమ్ రాష్టంలో అభ్యసించారు. చైన్నెలో ఉన్నత విద్యను అభ్యసించారు. తొలినాళ్లలో తల్లిదండ్రులు సినిమాల వైపు పంపించకపోవడంతో నిరాశ చెందారు. శంకరమంచి శ్రీనివాసరావును వివాహం చేసుకున్న తర్వాత సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుని నిర్మాత బీఎన్.రెడ్డిని కలిశారు. ఆయన నాగిరెడ్డికి సిఫార్సు చేయడంతో విజయా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన షావుకారు అనే తెలుగు చిత్రంలో ఎన్‌టీ.రామారావు సరసన నటించారు. దీంతో ఆమె పేరు షావుకారు జానకిగా మారింది.
తమిళ సినీ వినిలాకాశంలోనూ..
జానకి తెలుగింట పుట్టినా తమిళ చిత్ర పరిశ్రమలో సైతం తనదైన ముద్ర వేశారు. మోడర్న్ థియేటర్స్ నిర్మించిన వలయాపతి చిత్రంతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. జెమిని, ఏవీఎం వంటి అగ్ర సంస్థల చిత్రాల్లో నటించారు. భాగ్యలక్ష్మి, పడిక్కాత మేధై, పాలుమ్ పళముమ్, పార్ మగళే పార్, పుదియ పరవై, నీర్కుమిళి, భామా విజయం, ఎదిర్ నీచ్చల్, ఇరు కోడుగల్, తిల్లు ముల్లు వంటి అనేక చిత్రాలు ఆమెకు నటిగా మంచి పేరు తీసుకువచ్చాయి. విషాద సన్నివేశాలతో పాటు ప్రేమ, వీరం, కోపం, హాస్యం వంటి అన్ని రసాలను అద్భుతంగా పండించగల దిగ్గజ నటి ఆమె. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ వంటి ప్రముఖ కథానాయకులతో జత కట్టి వారితో పోటీ పడి నటించింది. టీవీ సీరియల్స్‌లో సైతం ఆమె రాణించారు. కథానాయకిగా తనకు తానే చాటి అనిపించుకున్న షావుకారు జానకి నిర్మాతగానూ మంచి చిత్రాలను నిర్మించారు.
భారతీయ సినిమాకు తీరని లోటు
షావుకారు జానకి మరణం దక్షిణాది చిత్ర పరిశ్రమకే కాకుండా భారతీయ సినిమాకే తీరని లోటని పూర్వ ఫిలింఛాంబర్ అధ్యక్షుడు, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ తెలిపారు. ఆమె 94 ఏళ్లపాటు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించారని, కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురై కన్నుమూయడం బాధాకరమని తెలిపారు. ఆమెతో తనకు 25 ఏళ్ల పరిచయం ఉందని, ఎప్పుడు ఫోన్ చేసినా బాగున్నారా? అని ఆప్యాయంగా అడిగేవారని గుర్తు చేసుకున్నారు. షావుకారు జానకి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా నటుడు, దర్శకుడు టీ.రాజేందర్ తదితర పలువురు సినీ ప్రముఖులు, దక్షిణ భారత నటీనటుల సంఘం నిర్వాహకులు, యాక్టీవ్ నిర్మాతల మండలి నిర్వాహకులు సంతాపాన్ని తెలియజేశారు. షావుకారు జానకికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆమె పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి స్థానిక తేనాంపేట, సెనటాప్ రెండవ వీధిలో గల ఆమె స్వగృహానికి తరలించారు.


