విద్యుత్‌ శాఖ అప్పులు, టెండర్లలో అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ శాఖ అప్పులు, టెండర్లలో అక్రమాలు

Aug 22 2026 12:41 AM | Updated on Aug 22 2026 12:41 AM

సెంథిల్‌ బాలాజీ వర్సెస్‌ నిర్మల్‌ కుమార్‌

డీలిమిటేషన్‌పై యూటర్న్‌ తీసుకున్నదెవరో?

అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం

సాక్షి, చైన్నె : అసెంబ్లీలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిణామాలన్నీ వివాదాల నడుమ జరిగాయి. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ శాఖలో జరిగిన అక్రమాల గురించి విద్యుత్‌ మంత్రి నిర్మల్‌కుమార్‌, మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ మధ్య తీవ్ర ఆరోపణలు, వాగ్యుద్ధం, సవాళ్లు చోటు చేసుకున్నాయి.

అప్పులపై ప్రశ్నాస్త్రాలు

డీఎంకే మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ మాట్లాడుతూ టీవీకే ప్రభుత్వంలో రానున్న 5 ఏళ్ల కాలంలో విద్యుత్‌ శాఖ కోసం అసలు అప్పులే చేయరా? అని ప్రశ్నించారు. కొత్త ప్రాజెక్టులకు ప్రభుత్వమే నిధులు ఇస్తుందా? లేక విద్యుత్‌ బోర్డుపై అప్పుల భారం పడకుండా ముఖ్యమంత్రి నుంచే నేరుగా నిధులు తీసుకువస్తారా? అంటూ సభలో విరుచుకు పడ్డారు. తమ హయాంలో విద్యుత్‌ కోతలకు ఆస్కారం లేకుండా చూశామని, ఇప్పుడు నిరంతరం విద్యుత్‌ కోతలు పెట్టారంటూ మండిపడ్డారు. ఇందుకు కౌంటర్‌ ఇస్తూ విద్యుత్‌ మంత్రి నిర్మల్‌కుమార్‌ డీఎంకే హయాంలో విద్యుత్‌ శాఖలో అన్ని అవకతవలు జరిగాయన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, త్వరలో చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపై సెంథిల్‌ బాలాజీ మాట్లాడుతూ పదే పదే విచారణలు, అక్రమాలు అంటూ ఆరోపణలు చేయడం, బెదిరించడం మాని చిట్టాను బయట పెట్టాలని సవాల్‌ చేశారు. మంత్రి నిర్మల్‌కుమార్‌ స్పందిస్తూ గతంలో సెంథిల్‌ బాలాజీ రవాణా శాఖమంత్రిగా ఉన్నప్పుడు సాగిన ఉద్యోగ నియామక కేటాయింపు ప్రస్తావన తీసుకు రావడంతో ఇద్దరి మధ్య మాటల సమరం సవాళ్ల వరకు దారి తీసింది.

యూటర్న్‌ తీసుకున్నదెవరో?

సభలో డీలిమిటేషన్‌ వ్యవహారం చర్చ జరుగుతుండగా ఈ వ్యవహారంలో యూటర్న్‌ తీసుకున్నదెవరో అన్న అంశంపై అధికార టీవీకే, ప్రతిపక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకేల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ దక్షిణ భారత సీఎంల సదస్సులో ఈ వ్యవహారంపై సీఎం విజయ్‌ సరైన స్పష్టత ఇవ్వలేదని మండి పడ్డారు. అన్నాడీఎంకే శాసన సభాపక్ష నేత పళణి స్వామి స్పందిస్తూ ఈ వ్యవహారంలో ప్రభుత్వం తన స్పష్టతను తెలియజేయాలని పట్టుబట్టారు. చివరకు మంత్రి ఆధవ్‌ స్పందిస్తూ డీలిమిటేషన్‌ వ్యవహారంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు, యూటర్న్‌లు లేవని స్పష్టం చేశారు. అసెంబ్లీలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశామని, ఇందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అనంతరం సభలో దేవాదాయ శాఖ గ్రాంట్ల ప్రకటన సమయంలో మంత్రి రమేష్‌, మాజీ మంత్రి శేఖర్‌బాబు మధ్య సవాళ్లతో మాటల సమరం సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement