సాక్షి, చైన్నె: ఎన్నూరు ముఖద్వారం వద్ద వేలాది చేపలు చనిపోయి తేలియాడటంపై తమిళనాడు శాసనసభలో శుక్రవారం తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్ష అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానానికి పర్యావరణ శాఖ మంత్రి రాజీవ్ సమాధానమిచ్చారు. నీటిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడమే చేపల మరణానికి ప్రధాన కారణమని, దీనిపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పళణి స్వామి మాట్లాడుతూ నదిలో రసాయనాలు, వ్యర్థాలు కలవడం వల్లే చేపలు చనిపోతున్నాయని, కాట్టుకుప్పం, నెల్లిక్కుప్పం తదితర గ్రామాల మత్స్యకారుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతినిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలోని పరిశ్రమల వ్యర్థాలు కొసస్థలై నదిలో కలవడం వల్ల నీరు పసుపు రంగులోకి మారుతోందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. పీఎంకే ఎమ్మెల్యే గణేషన్ స్పందిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీసే ప్రతి సంస్థపైనా కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. డీఎంకే ఎమ్మెల్యే తంగం తెన్నరసు స్పందిస్తూ కొసస్థలై నదిలోకి పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వల్ల కలుషితమవుతోందని, నది ప్రాంతాన్ని ఎకోలాజికల్ జోన్‌గా ప్రకటించాలని కోరారు.
తగ్గిన ఆక్సిజన్ శాతమే కారణం
పర్యావరణ శాఖ మంత్రి రాజీవ్ వివరణ ఇస్తూ ఎన్నూర్ ముఖద్వారం, రైల్వే వంతెన సహా 5 కీలక ప్రాంతాల్లో అధికారులు పరిశీలించారని తెలిపారు. ముఖద్వారంలో దాదాపు 2,150 కిలోల చనిపోయిన చేపలను గుర్తించామని, నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తీవ్రంగా పడిపోవడమే చేపల మరణానికి ప్రధాన కారణమని తేలిందన్నారు. పరిశ్రమల వ్యర్థాలు ఏ మాత్రం కారణం కాదన్నారు. మానవ వ్యర్థాలు, డ్రైనేజీ నీరు కలవడం వల్ల ఇది జరిగి ఉండవచ్చన్నారు. నీటి నమూనాలను ల్యాబ్‌కు పంపించామని, పూర్తి స్థాయి విచారణ కోసం నిపుణుల కమిటీని నియమించామన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.


