న్యూస్‌రీల్
రికార్డుల నుంచి తొలగించినారీల్స్‌గా ప్రచారం
అసెంబ్లీలో మాటల యుద్ధం
అధికార, ప్రతిపక్ష సభ్యుల ఢీ
సభలో ఉదయ నిధి ఆసక్తికర వ్యాఖ్యలు
కార్లు వద్దని డీఎంకే తిరస్కరణ
సాక్షి, చైన్నె : ‘‘అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించిన వీడియోలు రీల్స్ రూపంలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇదేం పద్ధతి. శాసనసభలో జరిగే కొన్ని వ్యవహారాలను రికార్డుల నుంచి తొలగించినా ప్రయోజనం శూన్యం. స్పీకర్‌కు అభినందనలు’’ అని ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం అసెంబ్లీ వ్యవహారాలను ప్రధాన అస్త్రంగా చేసుకున్న ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఉదయ నిధి ప్రసంగిస్తూ ‘‘అధ్యక్షా తమరు సభను ఎంతో సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ప్రతిపక్షాలమైన తమకంటే అధికార పక్ష సభ్యులకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. అధికార పక్ష సభ్యులు, మంత్రులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినప్పుడు తమరు వాటిని సభ రికార్డుల నుంచి తొలగిస్తున్నారు. ప్రతిపక్షాలకంటే అధికార పక్ష సభ్యుల మాటలనే అత్యధికంగా రికార్డుల నుంచి తొలగించి చరిత్ర సృష్టించారు. ఇందుకు అభినందనలు’’ అంటూ పేర్కొన్నారు.
కార్ల పంపిణీ వివాదం
ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇవ్వనున్న కొత్త కార్ల వ్యవహారం సభలో పెద్ద దుమారాన్ని రేపింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సూచన మేరకు తమ పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలకు కార్లు వద్దు అని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలందరికీ కొత్త వాహనాలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆర్థిక లోటులో ఉందంటూ సీఎం విజయ్ స్వయంగా చెబుతున్నారని తెలిపారు. అందుకే ప్రభుత్వం ఇవ్వనున్న కార్లను నిరాకరిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వంపై పడే అనవసరపు ఖర్చులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ పథకం కింద వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఇందుకు ప్రజాపనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున సమాధానం ఇస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేల్లో సొంత కార్లు కలిగి ఉన్నవారు ప్రభుత్వ వాహనాల కోసం దరఖాస్తు చేసుకోరని తెలిపారు. ‘ఇప్పటికే రెండు, మూడు సొంత ఇళ్లు కలిగిన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, ప్రభుత్వ బంగ్లాను ఎందుకు అడిగి తీసుకుంటున్నారు?‘ అని మంత్రి ఆదవ్ ప్రశ్నించారు. అదే సమయంలో డీఎంకే మాజీ మంత్రులు నెహ్రూ, ఏవీ వేలు స్పందిస్తూ ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదా ఉందని, ఆయనకు అది ప్రోటోకాల్ ప్రకారం కేటాయించిన గృహం అన్న విషయం కూడా మంత్రికి తెలియక పోవడం శోచనీయమని విమర్శించారు. దీంతో సభలో అధికార టీవీకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసెంబ్లీలో తొలగించిన వ్యవహారాలు ఏయే మీడియాలలో రీల్స్ రూపంలో వచ్చాయో ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో మాజీ సీఎం, డీఎంకే సభ్యుడు ఓ పన్నీరు సెల్వం ప్రసంగించే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేతకు ఈ సభలో మర్యాద, గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత ప్రసంగించే సమయంలో మంత్రులు పదే పదే స్పీకర్ అనుమతి కూడా లేకుండా మైక్ అందుకుని వ్యాఖ్యలు చేయడం సభ నిర్వహణకు భంగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.
సూపర్ సింగర్ షోను తలపిస్తోంది
సీఎంపై విమర్శలు... ఎదురు దాడిలో ఆధవ్, రాజ్‌మోహన్
‘‘సీఎం తన వద్ద మూడు ఫైళ్లు ఉన్నాయని చెప్పారు. వాటిని తెరిచి వెంటనే చర్యలు తీసుకోవచ్చు. బెదిరింపులకు, భయపెట్టే ప్రయత్నాలకు మేము భయపడము. ఆయన దేనికి భయపడుతున్నారో అర్థం కావడం లేదు’ అని ఉదయనిధి స్టాలిన్ సవాల్ చేశారు. మంత్రి ఆధవ్ అర్జున జోక్యం చేసుకుంటూ అన్ని శాఖల్లోనూ శ్వేతపత్రం విడుదల చేస్తామని పేర్కొన్నారు. తప్పులు జరిగినట్లు ఆధారాలు ఉంటే చట్టప్రకారమే చర్యలు ఉంటాయని సీఎం స్పష్టం చేశారని తెలిపారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత సభలో లేరని చెబుతూ ‘‘వీరు చేయని రీల్స్ ఉన్నాయా? పార్లమెంట్‌లో డీఎంకే ఎంపీలు ఎవరి పేరు చెప్పి ప్రమాణ స్వీకారం చేశారో అందరికీ తెలుసు. 2021 ఎన్నికల మేనిఫెస్టోలో శాసనసభ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పిన డీఎంకే, ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి’’ అని మంత్రి ప్రశ్నించారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ స్పందిస్తూ సీఎం వద్ద ఉన్న ఫైళ్లను త్వరగా తెరిచి చూడాలన్న ప్రతిపక్ష నేత కోరిక త్వరలోనే నెరవేరుతుందన్నారు. దీంతో సభలో డీఎంకే, టీవీకే సభ్యుల మధ్య పరస్పరం వ్యాఖ్యల తూటాలు, నినాదాలు హోరెత్తాయి.
శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయని, తాము వేసే ప్రశ్నలకు అధికార పక్షం ఇచ్చే సమాధానాలు చూసి ఆశ్చర్యపోతున్నామని ఉదయనిధి స్టాలిన్ ఎద్దేవా చేశారు. సభలో పాటలు పాడుతున్నారు. అసలు తాము చట్టసభకు వచ్చామా లేక సూపర్ సింగర్ రియాలిటీ షోకు వచ్చామా అనే అనుమానం కలుగుతోందన్నారు. తమరు ఎంతగా సభా రికార్డుల నుంచి అనేక వ్యాఖ్యలను తొలగించినా, సోషల్ మీడియాలో అవి రీల్స్‌గా విపరీతంగా షేర్ అవుతున్నాయని వివరించారు. దీనివల్ల తమరు వాటిని రికార్డుల నుంచి తొలగించడానికే అర్థం లేకుండా పోతోందనే విషయాన్ని పరిగణించాలన్నారు.


