●హిజ్రాపై దాడి, ఒకరి అరెస్ట్
తిరువొత్తియూరు: చైన్నె పులియంతోపు పి.ఎస్. మూర్తి నగర్ ప్రాంతానికి చెందిన నందిని (37) అనే ట్రాన్స్‌జెండర్‌కు, అదే ప్రాంతానికి చెందిన పల్లవి అనే మరో ట్రాన్స్‌జెండర్ వర్గానికి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గత 10వ తేదీ రాత్రి పల్లవి ,ఆమె స్నేహితులు మద్యం మత్తులో నందిని ఇంటికి వెళ్లారు. అక్కడ కరల్రతో కిటికీ అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నందిని ఆమె తరఫు వారు పల్లవిని, ఆమెతో వచ్చిన వారిని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైన పల్లవి.. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఈ ఘటనపై ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు, ఓట్టేరి ఇన్‌స్పెక్టర్ రాధాకృష్ణన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం నందినిని అరెస్ట్ చేసి, విచారణ జరిపి తర్వాత ఆమెను జైలుకు తరలించారు.
ప్రత్యేక ఆర్థిక మండళ్లు’గా ప్రకటించాలి
సేలం : నామక్కల్, తిరుచెంగోడ్ వంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలను తమిళనాడు ప్రభుత్వం వెంటనే ’ప్రత్యేక ఆర్థిక మండళ్లు’ గా ప్రకటించాలని వి ది లీడర్స్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు కె. అన్నామలై డిమాండ్ చేశారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్‌లో శనివారం నిర్వహించిన ’రిగ్ ఓనర్ల అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుచెంగోడ్, నామక్కల్ ప్రాంతాలు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయని వివరిస్తూ, చెంగల్పట్టు వంటి ప్రాంతాల్లో విదేశీ కంపెనీలకు ఇచ్చే తరహాలోనే ఇక్కడి పరిశ్రమలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేశారు. నామక్కల్ జిల్లా తలసరి ఆదాయం రూ. 4.40 లక్షలు అని, తమిళనాడులోనే 4వ అతిపెద్ద రాబడి ఉన్న జిల్లాగా నామక్కల్ నిలిచిందన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థను మరిన్ని ప్రాంతాలకు, దేశ విదేశాలకు విస్తరించాలంటే నామక్కల్, తిరుచెంగోడ్ ప్రాంతాలను వెంటనే ప్రత్యేక ఆర్థిక మండళ్లుగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
2 ఇళ్లలో రూ. 16 లక్షల విలువైన నగల చోరీ
తిరువొత్తియూరు: చైన్నె ఆయప్పాకంలో రెండు ఇళ్లలో నగలు, నగదు చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. అంబత్తూరు సమీపంలోని అయప్పాకం తమిళనాడు హౌసింగ్ బోర్డు క్వార్టర్స్‌కు చెందిన కమలనాథన్ (44) గత 5వ తేదీన ఇళ్లకు తాళం వేసి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. అనంతరం 8వ తేదీన తిరిగి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెంది లోపలికి వెళ్లి చూడగా, బీరువా పగలగొట్టి అందులో ఉన్న రూ. 16 లక్షల విలువైన బంగారు, వెండి నగలు దొంగిలించబడినట్లు తెలిసింది. దీనిపై అయప్పాకం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఇదేవిధంగా, ఇదే ప్రాంతంలో నివసిస్తున్న దామోదరన్ ( 60) అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి, రూ. 2 లక్షల విలువైన బంగారు, వెండి నగలను దొంగిలించారు. దీనిపై కూడా అయప్పాకం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.పై ఫిర్యాదులపై అయప్పాకం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో, దండయార్‌పేట ప్రాంతానికి చెందిన సెల్వం ( 38), కొరుక్కుపేట ప్రాంతానికి చెందిన బాలు రాజన్ (42) అనే ఇద్దరూ ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి తిరువణ్ణామలైలో దాక్కున్న ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 8 సవర్ల నగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసిన ఇద్దరినీ అంబత్తూరు కోర్టులో హాజరుపరిచి, పుళల్ జైలుకు తరలించారు.


