80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా అంబరాన్నంటాయి. శనివారం సెయింట్ జార్జ్ కోట వేదికగా సీఎం సి జోసెఫ్ విజయ్ ప్రప్రథమంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు.. అంటూ ప్రతిచోటా త్రివర్ణ పతకాకం రెపరెపలాడింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో నేతలు, అధికారులు జాతీయ నాయకులు సేవలను కొనియాడారు.
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో జార్జి కోటలోని సచివాలయం ఆవరణలో స్వాతంత్య్ర వేడుకులు అట్టహాసంగా సాగాయి. ఇన్నాళ్లూ ఇక్కడి స్తూపంపై ద్రవిడ పార్టీలకు చెందిన సీఎంలు జాతీయ పతకాన్ని ఎగుర వేస్తే, ప్రపథమంగా సినీ నటుడిగా, టీవీకే చీఫ్‌గా అధికార పగ్గాలు చేజిక్కించుకున్న సీ జోసెఫ్ విజయ్ జెండా ఆవిష్కరణ చేశారు. నీలాకంరై నివాసం నుంచి ఉదయం మెరీనా తీరం వైపుగా కాన్వాయ్‌లో రోడ్డుకు ఇరు వైపులా ఉన్న ప్రజలకు అభివాదం తెలియజేస్తూ వేడుకల వేదిక వద్దకు ఉదయాన్నే సీఎం విజయ్ వచ్చారు. సచివాలయం ఆవరణలో ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్, డీజీపీ మహేశ్‌కుమార్ అగర్వాల్ ఆహ్వానం పలికారు. త్రివిధ దళాలకు చెందిన అధికారులను ఈసందర్భంగాసాయికుమార్ పరిచయంచేశారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదిక పై నిలబడి రాష్ట్ర పోలీసు శాఖలోని వివిధ విభాగాల నుంచి గౌర వందనాన్ని ిసీఎం అందుకున్నారు. ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. ఓ చోట ఆ వాహనం నుంచి దిగి మరీ ప్రజలతో మమేకం అయ్యే విధంగా ముందకు సాగారు. అనంతరం సచివాలయం ఆవరణలోని 150 అడుగుల జెండా స్తూపంలో త్రివర్ణ పతకాన్ని ఎగుర వేసి గౌరవ వందనాన్ని సీఎం విజయ్ సమర్పించారు.
పింఛన్ పెంపు..
స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల సంక్షేమానికై పలు కీలక సంక్షేమ పథకాల పెంపును ఈసందర్భంగా ప్రకటించారు. మాతృ భూమి స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన యోధులకు, దేశ సరిహద్దులను కాపాడే సైనికులకు గౌరవ సూచకంగా ఈ నిధుల పెంపును చేపట్టినట్లు వివరించాఉ. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్వాతంత్య్ర సమరయోధులకు అందిస్తున్న నెలవారీ పింఛన్‌ను రూ.25,000కి పెంచుతున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. అలాగే త్యాగధనుల కుటుంబ పింఛన్‌ను రూ.12,500కి, చారిత్రక వీరుల వారసుల ప్రత్యేక పింఛన్‌ను రూ.11,500కి పెంచుతున్నట్టు వివరించారు. మాజీ సైనికుల కుమార్తెల వివాహ సాయం ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలకు పెంచారు. దివ్యాంగులైన మాజీ సైనికుల కుటుంబాలకు చెల్లిస్తున్న నెలవారీ సహాయక నిధిని రూ.5,000 నుంచి రూ.7,000కి పెంచారు. అనంతరం సీఎం విజయ్ బదిర, దివ్యాంగులైన , మానసిక పిల్లలను కలిశారు. వారికి కావాల్సిన సహాయకాలను అందజేశారు.
త్రివిధ దళాధిపతులను పరిచయంచేసుకుంటున్న సీఎం విజయ్
ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ప్రదానం
జాతీయ జెండాను ఎగుర వేస్తున్న సీఎం విజయ్
అవినీతి రహిత తమిళనాడు లక్ష్యం
‘తమిళనాడును లంచగొండితనం, అవినీతి, మత్తు పదార్థాల సంస్కృతి నుంచి కాపాడుకోవడమే నిజమైన స్వాతంత్య్రం అనే సిద్ధాంతంతో మహిళా భద్రత, సామాజిక న్యాయం, పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ప్రజా జీవితంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రజల సంక్షేమానికై కేంద్ర ప్రభుత్వంతో పరిపాలనాపరంగా సహకరిస్తామని ప్రకటించారు. అదే సమయంలో తమిళనాడు హక్కులకు భంగం కలిగించే కేంద్ర నిర్ణయాలను టీవీకే ప్రభుత్వం గట్టిగా అడ్డుకుంటుందన్నారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రజానుకూల పథకాలను కొనసాగిస్తున్నామని, అమ్మ క్యాంటిన్ల మరింత బలోపేతం చేస్తున్నామని, అలాగే, 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఉదయం అల్పాహార పథకాన్ని విస్తరించి, సెప్టెంబర్ 17న పెరియార్ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నామని ప్రకటించారు. అలాగే మేనమామ బంగారు ఉంగరం పథకం కూడా అమల్లోకి రానన్నట్టు ప్రకటించారు. 386 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చారిత్రక కోటపై 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ జాతీయ జెండా ఎగురవేసే అవకాశాన్ని కల్పించిన తమిళనాడు ప్రజలకు, యువతకు సీఎం విజయ్ తన హృద యపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేద్దామని పిలుపు నిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం వర్ధిల్లేలా నవ భారతాన్ని నిర్మించేందుకు ఈ పవిత్ర దినాన ప్రతిజ్ఞ చేద్దామని పిలుపు నిచ్చారు.
కేంద్రంతో ఘర్షణ వద్దనుకుంటేనే గౌరవం:
జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం విజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. త్యాగధనులకు అంజలి అంటూ దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను, ఆస్తులను త్యాగం చేసిన ప్రముఖులతో పాటు పేరు తెలియని ప్రతి ఒక్క పోరాట యోధునికి వీర వందనాలు అని వ్యాఖ్యలు చేశారు. బానిసత్వానికి వ్యతిరేకంగా అందరం ఒకటైనప్పుడే కుల, మత, భాషా ప్రాంతీయ భేదాలు సమసిపోతాయన్నారు. 1947 ఆగస్టు 15న మహాత్మా గాంధీ నాయకత్వంలో సాధించుకున్న ఈ స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడం అందరి బాధ్యతగా పిలుపు నిచ్చారు.


