సాక్షి, చైన్నె : ప్రజాసంక్షేమ పాలనతో తలసరి ఆదాయం రూ.3.06 లక్షలకు పెరిగిందని కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఆనందం వ్యక్తం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుచ్చేరి బీచ్ రోడ్డులోని గాంధీ మైదానం లో నిర్వహించిన వేడుకల్లో సీఎం రంగసామి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ పాలనా పురోగతి, అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను వెల్లడించారు
ఆర్థిక అభివృద్ధి – తలసరి ఆదాయం
గత ఐదేళ్ల పాలనలో ప్రజలు కోరుకున్న పలు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశామని వివరించారు. పుదుచ్చేరి ప్రజల మద్దతుతో తలసరి ఆదాయం రూ.3,06,119కి పెరిగిందన్నారు. రాబోయే రోజుల్లో పుదుచ్చేరిని మరింత ముందుకు తీసుకెళ్లేలా అభివృద్ధి పనులను ముమ్మరం చేస్తున్నామన్నారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు రూ.112 కోట్ల వ్యయంతో రోజుకు 2 లక్షల లీటర్ల సామర్థ్యం గల కొత్త ఆటోమేటెడ్ డెయిరీ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. జాతీయ క్షీరాభివృద్ధి పథకం కింద తొలి విడత నిధులు విడుదలయ్యాయని, అలాగే రూ.34.35 కోట్లతో ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాన్ని విస్తరించి ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 20,000 లీటర్లకు పెంచుతున్నామని వివరించారు. 6,200 మంది పాడి రైతులకు రూ.11.66 కోట్ల రాయితీ అందిస్తున్నామని, చేపల వేట రంగంలోని యువతకు మైరెన్ ఫిట్టర్, షిప్ నావిగేషన్ కోర్సుల్లో ఉపాధి శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నత విద్య నభ్యసించే మత్స్యకార విద్యార్థుల పూర్తి ఫీజును ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.
తొలిసారి తమిళ్ తాయ్ వాల్తుతో వేడుక
ఇప్పటివరకు పుదుచ్చేరి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం, జాతీయ గీతం ముగిసిన తర్వాత చివరలో రాష్ట్ర గీతం తమిళ్ తాయ్ వాల్తు ఆలపించేవారు. దీనిపై తమిళ సంఘాల నుంచి నిరసనలు వ్యక్తమవ్వడంతో, ఈసారి వేడుకల్లో తొలిసారిగా ప్రారంభంలోనే తమిళ్ తాయ్ వాల్తు, ఆ తర్వాత వందేమాతరం, జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతం ఆలపించడం విశేషం.ఈ వేడుకల్లో తాత్కాలిక స్పీకర్ అన్బళగన్, మంత్రులు నమశ్శివాయం, రాజవేలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు, వైద్య సిబ్బందికి సీఎం పతకాలు ప్రధానం చేశారు.
గృహిణులకు ఆర్థిక సాయం పెంపు:
కుటుంబ యజమానురాలైన మహిళలకు నెలకు ఇచ్చే రూ.1,000 ఆర్థిక సాయాన్ని 2026 జనవరి నుంచి రూ.2,500కి పెంచామన్నారు. దీనివల్ల 65 వేల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఇందిరా గాంధీ స్క్వేర్ నుండి రాజీవ్ గాంధీ స్క్వేర్‌ను అనుసంధానించేలా రూ.483.51 కోట్ల అంచనా వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందన్నారు.ఈ పనులు త్వరలోనే పనులు ప్రారంభమవు తాయనిపేర్కొంటూ,ఏడీబీ రూ.4,750 కోట్ల రుణం సాయంతో పుదుచ్చేరిలోని నాలుగు ప్రాంతాల్లో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే50 ఎంఎల్‌డీ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతులు లభించాయన్నారు. పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద కేంద్ర ఇచ్చే రూ.78,000 రాయితీకి అదనంగా పుదుచ్చేరి ప్రభుత్వం కిలోవాట్‌కు రూ.10,000 చొప్పున గరిష్టంగా రూ.30,000 సబ్సిడీ ఇస్తున్నామని,ఇప్పటివరకు 4,896 ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు అమర్చి రూ.31.57 కోట్ల రాయితీ ఇచ్చామని వివరించారు.2025–26 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ రూ.200 కోట్ల రాబడి సాధించిందరని, కేంద్ర నిధులతో రూ.132 కొత్త బస్ షెల్టర్ల నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయని తెలిపారు.


