సాక్షి,చైన్నె : దక్షిణ రైల్వే ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చైన్నె పెరంబూరులోని రైల్వే స్టేడియంలో ఘనంగా జరిగాయి. దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ యు. సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆర్పీఎఫ్ ఐజీ–ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ కె. అరుణ్ జోతీతో కలసి ఆయన ఆర్పీఎఫ్ దళాలు, సెయింట్ జాన్స్ అంబులెన్స్ బ్రిగేడ్ నిర్వహించిన పరేడ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జనరల్ మేనేజర్ విపిన్ కుమార్, చైన్నె డివిజనల్ రైల్వే మేనేజర్ శైలేంద్రసింగ్, దక్షిణ రైల్వే మహిళా ప్రధాన కార్యాలయ సంస్థ అధ్యక్షురాలు లలితా దేవి, రైల్వే అధికారులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు మరియు గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అభివృద్ధి పథంలో దక్షిణ రైల్వే
2025–26 ఆర్థిక సంవత్సరం నుండి జూలై 2026 వరకు దక్షిణ రైల్వే సాధించిన పురోగతిని, సాధించిన నూతన మైలురాళ్లను జీఎం వివరించారు. రైల్వే అధికారుల, సిబ్బంది కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. భారతీయ రైల్వే జాతీయ సమైక్యతకు చిహ్నమని, భద్రత, సామర్థ్యం, ప్రయాణికుల సేవలు , విశ్వసనీయతలో దక్షిణ రైల్వే ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంటుందని పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా జోన్ పరిధిలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో భారీ జాతీయ జెండాలను ఎగురవేశారని, అలాగే ముఖ్యమైన రైల్వే కార్యాలయాలు, స్టేషన్లను త్రివర్ణ శోభతో విద్యుత్ దీపాలతో అలంకరించారని పేర్కొన్నారు.
ఐసీఎఫ్‌లో రికార్డు స్థాయిలో కోచ్‌ల తయారీ
పెరంబూరులోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎం. అరుణ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ మనీష్ అగర్వాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి ఆర్పీఎఫ్ దళాల పరేడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఐసీఎఫ్ సాధించిన చారిత్రాత్మక విజయాలను వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 13.2శాతం వృద్ధితో మొత్తం 3,405 కోచ్‌లను తయారు చేసి ఐసీఎఫ్ రికార్డు సృష్టించిందని, అలాగే తన 80,000వ ప్యాసింజర్ కోచ్‌ను కూడా విజయవంతంగా పట్టాలెక్కించిందని తెలిపారు. స్వదేశీ సాంకేతికతతో త్వరలో అందుబాటులోకి రానున్న 24 కోచ్‌ల వందే భారత్ స్లీపర్’ రైలు సెట్ డిజైన్లు, అసెంబ్లీ ప్లాన్లు పూర్తయ్యాయని ప్రకటించారు. అ మృత్ భారత్ వెర్షన్ 3.0 సామాన్య ప్రయాణికులకు కూడా తక్కువ ధరలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఏసీ, జనరల్ స్లీపర్ తరగతులతో కూడిన నెక్స్ట్ జనరేషన్‌గా రూపుదిద్దుకుంటున్నదని ప్రకటించారు. సరుకు రవాణా రంగంలో వేగాన్ని పెంచేందుకు ఫ్రైట్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు సెట్లను తయారు చేశామన్నారు. దేశంలోనే తొలిసారిగా ముంబై సబర్బన్ సర్వీసుల కోసం 15–కోచ్‌ల ఈఎంయూ రేక్‌ను ఐసీఎఫ్ సిద్ధం చేశామన్నారు. నాన్–ఏసీ ఈఎంయూ కోచ్‌లలో ప్రయాణికుల భద్రత కోసం ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లను అమర్చారని వివరించారు. కోల్‌కతా మెట్రో కోచ్‌ల ఇంటీరియర్స్‌ను అల్యూమినియం ప్యానెలింగ్‌తో మరింత ఆకర్షణీయంగా, సురక్షితంగా నవీకరించామన్నారు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 65 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో వెండి పతకం సాధించి ఐసీఎఫ్‌కు పేరు తెచ్చిన క్రీడాకారుడు ఎం. రాజాను జీఎం మనీష్ అగర్వాల్ ఈ వేదికపై ప్రత్యేక్షంగా అభినందించారు.


