– 10 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, చైన్నె : తమిళనాడు హోంశాఖ కార్యదర్శి కె. మణివాసన్ ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 10 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ప్రధానంగా రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం డీజీపీగా ఉన్న పి. బాలనాగదేవిని అత్యతంత కీలకమైన సీబీసీఐడీ డీజీపీగా నియమితులయ్యారు. అలాగే అబిన్ దినేష్ మోడక్– సీబీసీఐడీ నుండి రాష్ట్ర సైబర్ క్రైమ్ అదనపు డీజీపీగా బదిలీ చేశారు. విద్యా జయంత్ కులకర్ణి– వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఈమెకు ఆర్థిక నేరాల విభాగం అదనపు డీజీపీ బాధ్యతలు అప్పగించారు. ఎం. రామమూర్తి – చైన్నె ఇంటెలిజెన్స్ వింగ్ (2) డిప్యూటీ కమిషనర్ నుంచి ’క్యూ’ బ్రాంచ్ సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు.క్యూబ్రాంచ్ ఎస్పీ పి.కె. అరవింద్‌ను చైన్నెనార్త్ జోన్ ఎస్బీసీఐడీ వింగ్ (1) ఎస్పీగా నియమించారు. చైన్నె నార్త్ జోన్ సీబీసీఐడీ ఎస్పీగా ఉన్న అర్పితా రాజ్‌పుత్ ను చైన్నె అన్నా నగర్ డిప్యూటీ కమిషనర్‌గా, ఇక్కడున్న ఈశ్వరన్‌ను తమిళనాడు కమాండోఫోర్స్ ఎస్పీగా బదిలీ చేశారు. ఆవడి కమిషనరేట్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఎస్.ఆర్. సెంథిల్ కుమార్‌ను నాగపట్నం కోస్టల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్పీగా, చైన్నె నార్త్ రేంజ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ ఎస్పీ వి. శరవణ కుమార్‌ను ఉగ్రవాద నిరోధక విభాగం ఎస్పీగా, ఈ విభాగంలో ఉన్న డి. రమేష్ బాబును తిరునెల్వేలి సిటీ హెడ్‌క్వార్టర్స్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు.
జీటీబీకి డబ్ల్యూటీసీ గుర్తింపు
– చెంగల్పట్టుకు అంతర్జాతీయ బ్రాండ్
సాక్షి, చైన్నె : దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకరైన జీటీ భారతికి ప్రతిష్టాత్మకమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ నుండి లైసెన్స్ దక్కింది. దీంతో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో సరికొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. ఈ ఒప్పందంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లోని 300కు పైగా అంతర్జాతీయ డబ్ల్యూటీసీ నెట్‌వర్క్‌లో జీటీ భారతి చేరింది. న్యూయార్క్ నుండి చెంగల్పట్టు వరకు డబ్ల్యూటీసీ బ్రాండ్ అనేది అంతర్జాతీయ వాణిజ్యానికి, గ్లోబల్ విజిబిలిటీకి ఒక ప్రతిష్టాత్మక చిరునామాగా నిలుస్తుందని జీటీబీ చైర్మన్ భరత్ కాంతి దోషి , మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ భారతి అరుణాచలం, డబ్ల్యూ టీసీఏ ఆసియా పసిఫిక్ ఉపాధ్యక్షుడు స్కాట్‌వాంగ్‌లు ప్రకటించారు. చైన్నె శివారులోని చెంగల్పట్టు రీజియన్‌లోని వ్యాపార రంగాన్ని అంతర్జాతీయ అవకాశాలతో అనుసంధానించడంలోడబ్ల్యూ టీసీ చెంగల్పట్టు కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నామన్నారు. తమిళనాడుకు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఆకర్షించేలా, భవిష్యత్ తరాలకు ఆర్థిక విలువను సృష్టించేలా ఈ సంస్థను నిర్మిస్తామన్నారు. రూ. 7,000 కోట్ల పెట్టుబడి అంచనాతో లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు ఇది వేదిక కానున్నట్టు ప్రకటించారు. చెంగల్పట్టు జిల్లా ప్రస్తుతం తమిళనాడులోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్, పారిశ్రామిక క్లస్టర్లకు కేంద్రంగా ఉందని, తాజాగా డబ్ల్యూటీసీ చెంగల్పట్టు, ఇప్పటికే ఉన్న డబ్ల్యూటీసీ చైన్నెతో కలిసి ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఉమ్మడిగా కృషి చేయనున్నట్టు ధీమా వ్యక్తం చేశారు.
నీటి నిల్వలపై.. నిర్లక్ష్యం తగదు
– నైనార్ ధ్వజం
సాక్షి, చైన్నె : వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే యుద్ధప్రాతిపదికన చెరువులు, కుంటలను పూడికతీత తీయడంతో పాటు, నీటిని నిల్వ చేసేందుకు అక్కడక్కడా చిన్న చిన్న చెక్‌డ్యామ్‌లను నిర్మించడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై గురువారం ఆయన స్పందిస్తూ, తమిళనాడులో తాగునీటి కొరత కారణంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడాల్సిన దుస్థితి కొనసాగుతుండటం ఆందోళనకరంగా పేర్కొన్నారు. చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలమట్టం పడిపోతున్న తరుణంలో, దాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు దాహంతో అలమటించడానికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణంగా వివరించారు. అధికారంలోకి రాగానే ప్రజలను మరిచిపోయిన ముఖ్యమంత్రి విజయ్ అలసత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికై నా నిద్ర నుంచి మేల్కొని ప్రజల దాహం తీర్చడానికి బోర్‌వెల్‌లు వేయడం, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడం వంటి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రాబోయే వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జలాశయాల పూడికతీత పనులను, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.


