ఆస్తిపన్ను వడ్డన ప్రచారమే..! | - | Sakshi
Sakshi News home page

ఆస్తిపన్ను వడ్డన ప్రచారమే..!

Aug 14 2026 7:56 AM | Updated on Aug 14 2026 7:56 AM

● రీజనల్‌ డిప్యూటీ కమిషనర్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చు ● చైన్నె కార్పొరేషన్‌ కమిషనర్‌ జి.ఎస్‌.సమీరన్‌ వివరణ

సాక్షి, చైన్నె: చైన్నె కార్పొరేషన్‌లో ఆస్తి పన్ను 10 రెట్లకు పైగా పెరిగిందని ఆస్తి యజమానులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో దీనిపై అసంతృప్తి ఉన్నవారు కార్పొరేషన్‌ రీజనల్‌ డిప్యూటీ కమిషనర్‌కు అప్పీల్‌ చేసుకుని పరిష్కారం పొందవచ్చని కార్పొరేషన్‌ కమిషనర్‌ జి.ఎస్‌. సమీరన్‌ సూచించారు. వివరాలు.. గత కొన్నేళ్లుగా చైన్నె కార్పొరేషన్‌ నిర్వహించిన స్వయం ప్రకటన విధానంలో ఆస్తి యజమానులు సమర్పించిన వివరాల ఆధారంగా ఆస్తి పన్ను సవరణ ప్రక్రియను ప్రారంభించారు. గతంలో కరోనా మహమ్మారి కారణంగా ఈ పునర్‌ సమీక్ష పనులను నిలిపివేశారు. ప్రస్తుతం ఆస్తి యజమానులు ఇచ్చిన వివరాలతో పాటు రీ–మెజర్మెంట్‌, జియోస్పేషియల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ , శాటిలైట్‌ ఇమేజ్‌ డేటా ఆధారంగా ఆస్తి పన్ను అంచనాలను కార్పొరేషన్‌ సవరిస్తున్నదని. ఆస్తి సరైన వినియోగం, కచ్చితమైన భవన విస్తీర్ణాన్ని నిర్ధారించడానికి, అందరికీ సమానమైన , సరైన పన్నును ఖరారు చేయడానికే ఈ సవరణలు చేసినట్లు కార్పొరేషన్‌ తెలిపింది. అలాగే యజమానులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు.. భవనం నిర్మించిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, 2025–26 ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగం నుండి ఈ కొత్త పన్ను లెక్కింపును అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

పారదర్శకత లేదు

కార్పొరేషన్‌ చేపట్టిన ఈ కచ్చితమైన అంచనా ప్రక్రియ వల్ల ఆస్తి పన్ను మునుపటి కంటే పలు రెట్లు పెరిగిందని యజమానుల నుండి ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర చైన్నె నివాసితుల సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు టి.కె. షణ్ముగం మాట్లాడుతూ ఉత్తర చైన్నెలో ఒక ఆస్తి యజమాని ఇప్పటివరకు అర్ధసంవత్సరానికి రూ. 295 పన్ను చెల్లించేవారని, ఇప్పుడు దాన్ని ఏకంగా రూ. 3,255కి పెంచుతూ కార్పొరేషన్‌ నోటీసు పంపిందని వివరించారు. పైగా ఈ మొత్తాన్ని గత ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగం నుండి చెల్లించాలని పేర్కొంటున్నారన్నారు. దీని ప్రకారం.. గత ఏడాది బకాయి, ప్రస్తుత ఏడాది మొదటి అర్ధభాగం, అక్టోబర్‌లో వచ్చే రెండో అర్ధభాగం.. ఇలా ఒకేసారి ఇంత పెద్ద మొత్తాన్ని ఒక మధ్యతరగతి ఆస్తి యజమాని ఎలా చెల్లించగలడు?, ఈ పన్ను పెంపులో ఎలాంటి పారదర్శకత లేదని మండిపడ్డారు.

కమిషనర్‌ సమీరన్‌ వివరణ..

ఈ వివాదంపై కార్పొరేషన్‌ కమిషనర్‌ జి.ఎస్‌. సమీరన్‌ స్పందించారు. ఆస్తి పన్ను వడ్డించ లేదని, సవరణ ప్రక్రియలు జరుగుతున్నట్టు వివరించారు. కార్పొరేషన్‌లో ఇదివరకు తక్కువగా అంచనా వేసి, తక్కువ పన్ను చెల్లిస్తున్న వారికి.. కచ్చితమైన డేటా ఆధారంగా పన్నును సవరించి నోటీసులు పంపామని తెలిపారు. ఈ కొత్త పన్నుపై ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే, నోటీసు అందిన 15 రోజుల్లోపు సంబంధిత రీజనల్‌ డిప్యూటీ కమిషనర్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చని సూచించారు. అప్పీల్‌ చేసుకున్న 30 రోజుల్లోగా ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. కార్పొరేషన్‌లో ఆస్తి పన్నులను అడ్డగోలుగా పెంచేశారంటూ వస్తున్న వాస్తవ విరుద్ధమైన వార్తలను , పుకార్లను ప్రజలు నమ్మవద్దని కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement