ఆన్‌లైన్‌ ద్వారా మద్యం విక్రయాలు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ ద్వారా మద్యం విక్రయాలు

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

● ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌

సాక్షి, చైన్నె: ఆన్‌లైన్‌ ద్వారా మద్యం విక్రయాలు (బుకింగ్‌) జరపాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ లాయర్స్‌ సోషల్‌ జస్టిస్‌ ఫోరమ్‌ అధ్యక్షుడు కె. బాలు మద్రాసు హైకోర్టులో ప్రజాహిత పిటిషన్‌ దాఖలు చేశారు. తమిళనాడు–పుదుచ్చేరి బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు కూడా అయిన లాయర్‌ కె. బాలు తన పిటిషన్‌లో పలు ఆసక్తికర అంశాలు వివరించారు.

రాజ్యాంగ విరుద్ధం..

తమిళనాడులో 1971 వరకు ఉన్న సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి, ప్రస్తుతం టాస్మాక్‌ ద్వారా మద్యం విక్రయాలు జరుపుతున్నారని,. ప్రజారోగ్యం, పౌష్టికాహారాన్ని పెంపొందించడం, ఆరోగ్యానికి హానికరమైన మత్తుపదార్థాలు, మద్యపానాన్ని నిషేధించాలని స్పష్టం చేస్తున్న రాజ్యాంగంలోని నిబంధన 47కు విరుద్ధంగా తమిళనాడు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అని వివరించారు. పాఠశాలలు, దేవాలయాల సమీపంలో ఉన్న 717 టాస్మాక్‌ దుకాణాలను మూసివేయాలని మే 12న ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వాటిలో చాలా దుకాణాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయని ఆరోపించారు.

ఆన్‌లైన్‌ విక్రయాలతో ముప్పు

ఈ తరుణంలో ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకుని టాస్మాక్‌ దుకాణాల్లో మద్యం పొందే సౌకర్యాన్ని ప్రారంభిస్తూ టాస్మాక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆగస్టు 7న ఒక ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. ఆన్‌లైన్‌ మద్యం కొనుగోళ్లకు 21 ఏళ్ల లోపు వారికి అనుమతి ఉండదని టాస్మాక్‌ సంస్థ వివరణ ఇచ్చినప్పటికీ.. పెద్దల ఆన్‌లైన్‌ ఐడీలు, అడ్రస్‌లను ఉపయోగించి చిన్నపిల్లలు కూడా మద్యం కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్‌ దుకాణాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వద్దవృద్ధులు, మహిళలు కాళ్ల నొప్పులతో గంటల తరబడి క్యూలైన్లలో నిలబడుతుంటే.. వారికి ఇలాంటి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. అయితే, మద్యం తాగే వారి కోసం తమిళనాడు ప్రభుత్వం ఈ ఆన్‌లైన్‌ సౌకర్యాన్ని కల్పించడం వల్ల సమాజానికి పెద్ద ముప్పు వాటిల్లుతుందన్నారు, ఆన్‌లైన్‌ మద్యం విక్రయాలకు సంబంధించి టాస్మాక్‌ ఎండీ విడుదల చేసిన ఉత్తర్వులను, దానికి అనుమతి ఇస్తూ జూలై 24న ఆర్థిక శాఖ కార్యదర్శి జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరారు. అలాగే ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు ఆ నిర్ణయాలపై స్టే విధించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ శుక్ర లేదా సోమవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement