సాక్షి, చైన్నె: తమిళనాడు రాష్ట్ర లా కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ డి. కృష్ణకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శి పి. సుమతి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర లా కమిషన్‌ను పునర్వ్యవస్థీకరిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ ఛైర్మన్‌గా మణిపూర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కృష్ణకుమార్‌ను నియమించారు. పూర్తిస్థాయి సభ్యులుగా మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి డి.కె. రామచంద్రన్, న్యాయ శాఖ మాజీ కార్యదర్శి ఎ. అరుణగిరి, స్వల్ప కాలిక సభ్యులుగా మాజీ జిల్లా జడ్జీలు పి. మోహన్‌దాస్, ఆర్. గోవిందరాజన్,న్యాయ శాఖలో కార్యదర్శి హోదా కలిగిన అధికారి కమిషన్‌కు పూర్తిస్థాయి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
లా కమిషన్ విధులు – పరిధి
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల్లోని లోపాలను సవరించడానికి, అవసరమైన మార్పులపై ప్రభుత్వానికి ఈక మిషన్ సూచనలు చేస్తుంది. సామాజిక, ఆర్థిక పురోగతికి తోడ్పడే చట్టపరమైన చర్యలను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఇతర రాష్ట్రాల సంబంధాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు మార్గదర్శకాలను అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించే కేంద్ర చట్టాల్లో చేయాల్సిన మార్పులు, సవరణలపై ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. ఈ లా కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. ఈ కమిషన్ కార్యాలయం చైన్నె గిండి ఇండిస్టియల్ ఎస్టేట్లోని సిడ్కో భవనం 5వ అంతస్తు నుంచి పనిచేస్తుందని జీవోలో పేర్కొన్నారు.
తమిళనాడు సరిహద్దుల్లో కన్నడ సంఘాల ఆందోళన
– హోసూరులోనే నిలిచిపోయిన బస్సులు
సాక్షి, చైన్నె: మేఘదాతు ప్రాజెక్టు వివాదం కారణంగా తమిళనాడు– కర్ణాటక సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కావేరీ నదిపై మేఘదాతు వద్ద వెంటనే ఆనకట్ట నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, దీనిని వ్యతిరేకిస్తున్న తమిళనాడు తీరును ఖండిస్తూ పలు కన్నడ సంఘాలు సరిహద్దుల్లో రాస్తారోకోకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా తమిళనాడు ప్రభుత్వ బస్సులను హోసూరు సరిహద్దులోనే నిలిపివేశారు. ఆందోళనల దృష్ట్యా రెండు రాష్ట్రాల పోలీసులు సరిహద్దుల్లో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.
హోసూరు సరిహద్దులోనే నిలిచిన బస్సులు
కృష్ణగిరి జిల్లా పోలీసులు, తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి బెంగళూరు వెళ్లే అన్ని తమిళనాడు ప్రభుత్వ బస్సులను సరిహద్దులోనే నిలిపివేశారు. కన్నడ సంఘాల ఆందోళనలు ముగిసే వరకు తమిళనాడు బస్సులను కర్ణాటకలోకి అనుమతించలేదు.
ప్రైవేటు వాహనాల రాకపోకలు యథాతథం
తమిళనాడు రవాణా సంస్థ బస్సులపై మాత్రమే ఆంక్షలు విధించగా... తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కార్లు, ఇతర లారీలు సరిహద్దు దాటి రాకపోకలు సాగించాయి. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వ బస్సులు, ప్రైవేటు బస్సులు యథావిధిగా నడిచాయి.బెంగళూరు వెళ్లే తమిళనాడు ప్రయాణికులు సరిహద్దు ప్రాంతమైన జూజువాడి వద్ద దిగి కర్ణాటక బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సరిహద్దు వద్ద పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది.
శానిటేషన్ కార్మికుల
భద్రత కోసం సేఫర్ చాలెంజ్
సాక్షి, చైన్నె: శానిటేషన్ కార్మికుల ప్రాణరక్షణే లక్ష్యంగా రెకిట్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా తో కలిసి జాతీయ స్థాయిలో ఒక సరికొత్త ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. సేఫర్ చాలెంజ్ పేరుతో ప్రారంభించిన ఈ పోటీ ద్వారా మురుగు కాల్వలు, సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే సమయంలో ప్రమాదకర వాయువులను గుర్తించే వినూత్న పరికరాల తయారీకి ఆవిష్కరణలను ఆహ్వానించింది. రెకిట్ సంస్థకు చెందిన హార్పిక్ వరల్డ్ టాయిలెట్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును తలపెట్టారు.
విషవాయువుల గుర్తింపు..
డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకుల్లో నిండిపోయే విషవాయువులు, ప్రాణవాయువు (ఆక్సిజన్) కొరతను రియల్ టైమ్‌లో గుర్తించి కార్మికులను హెచ్చరించే వేరబుల్ (ధరించే) పరికరాలను రూపొందించడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశంగా ప్రకటించారు. స్టార్టప్‌లు, ఇంజినీర్లు, పరిశోధకులు, విద్యాసంస్థలు , సాంకేతిక ఆవిష్కర్తలు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులుగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ 2047 విజన్‌తో పాటు స్వచ్ఛ భారత్ మిషన్ 2.ఓ తదితర కార్యక్రమాలకు అనుగుణంగా ఓ పోటీ నిర్వహించనున్నారు. ఇందులో విజేతకు రూ. 5 లక్షలు, రన్నరప్‌కు రూ. 2 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ. లక్ష అందజేయనున్నారు. ఎంపికై న విజేతలకు నిధుల సహాయంతో పాటూ మెంటార్‌షిప్, గ్యాస్ డిటెక్షన్ పరికరాలను క్షేత్రస్థాయిలో మునిసిపాలిటీలు,అర్బన్ లోకల్ బాడీస్ ద్వారా పరీక్షించే సువర్ణావకాశం అందించనున్నారు. దరఖాస్తులను సెప్టెంబరు 1వ తేదీలోపుచేసుకోవాలని, అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా విజేతలను ప్రకటించడం జరుగుతుందన్నారు.


