రంగంలోకి రాందాసు కుమార్తె, మనవడు | - | Sakshi
Sakshi News home page

రంగంలోకి రాందాసు కుమార్తె, మనవడు

Jul 27 2026 12:36 AM | Updated on Jul 27 2026 12:36 AM

పుదుచ్చేరి సీఎం రంగన్నతో భేటీ కావడంతో కొత్త చర్చ

ఇక తమిళనాట ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ రాజకీయం

ఉత్తర తమిళనాడపై ప్రత్యేక దృష్టి

పీఎంకే రాజకీయాలలో ట్విస్టు చోటు చేసుకుంది. పార్టీలో చీలిక దిశగా రాందాసు కుమార్తె శ్రీగాంధీ ప్రయత్నాలు చేపట్టారు. తన కుమారుడు ముకుందన్‌తో కలిసి పుదుచ్చేరి సీఎం రంగస్వామి ద్వారా పావులు కదుపుతుండటం చర్చకు దారి తీసింది. పీఎంకే అసంతృప్తి వాదులందర్నీ, వన్నియర్‌ సంఘాల నేతలన్నీ ఏకం చేసి, తమిళనాట ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రయత్నాలు విస్తృతం చేశారు.
ఉత్తరతమిళనాడు వైపుగా రంగన్న చూపు

ఆగస్టు 4న కీలక ప్రకటన

సేలం పీఎంకే మాజీ ఎమ్మెల్యే అరుళ్‌తో పాటు పలువురు కీలక నేతలు పుదుచ్చేరిలో రంగస్వామిని కలిసి ఎన్‌.ఆర్‌. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. తాజాగా రాందాసు కుటుంబానికి చెందిన వారు సైతం భేటి కావడంతో ప్రాధాన్యత నెలకొంది. ఆగస్టు 4న చైన్నెలో భారీ సభకు పీఎంకే అసంతృప్తి వాదులు కసరత్తులు చేస్తుండటం గమనార్హం. ఆగస్టు 4న పుదుచ్చేరీ సీఎం రంగస్వామి పుట్టినరోజును పురస్కరించుకుని చైన్నెలో ఒక భారీ బహిరంగ సభ వేదికగా తమిళనాడు ఎన్‌.ఆర్‌. కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించడమే కాకుండా, పీఎంకేలో చీలిక దిశగా అక్కడున్న ముఖ్య నేతలు, సీనియర్లను తమ వైపుగా తిప్పుకుని పదవులు అప్పగించేందుకు రంగన్న సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది.

తండ్రి రాందాసుతో శ్రీగాంధీ

సాక్షి, చైన్నె : పీఎంకేలో గత ఏడాదిన్నర కాలంగా సాగిన పరిణామాలు గురించి తెలిసిందే. ఈ ప్రయాణంలో తనను వారసుడైన అన్బుమణి మోసం చేశాడంటూ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు తీవ్ర ఆరోపణలు, ఆగ్రహాలు, ఆవేదనలు వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆయనకు పక్క బలంగా కుమార్తె శ్రీగాంధి, మనవడు ముకుందన్‌తో పాటుగా సీనియర్‌ నేతలు అనేక మంది నిలబడ్డారు. అన్బుమణికి చెక్‌ పెట్టే దిశగా శ్రీగాంధికి పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ పదవిని సైతం రాందాసు కట్టబెట్టారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తై, తమిళనాట అధికార మార్పు పరిణామాల నేపథ్యంలో తాజాగా తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి ఏకం అయ్యారు. రాందాసు ఏకంగా రాజకీయ సన్యాసం పుచ్చుకుని పీఎంకే బాధ్యతలన్నీ అన్బుమణికి అప్పగించేశారు. అయితే, తమను రాందాసు వాడుకుని వదిలేశారన్న ఆగ్రహంతో వన్నియర్‌ సంఘాల నేతలు, కుటుంబానికి చెందిన కుమార్తె శ్రీగాంధి, మనవడు ముకుందన్‌తో పాటుగా ఎందరో నేతలు తీవ్ర అసహనంతో ఉంటూ వస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా పీఎంకేకు ట్విస్టు ఇచ్చే దిశగా శ్రీగాంధీ అడుగుల వేగం పెంచడం చర్చకు దారి తీసింది.

రంగస్వామితో రామదాస్‌ కుమార్తె,

మనుమడు భేటీ

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామానికి దారి తీసే ఆవిష్కరణ ఆదివారం పుదుచ్చేరి వేదికగా జరిగింది. రాందాసు కుటుంబ వివాదాల రాజకీయం ట్విస్టు రాజకీయాలకు వేదిక అయింది. పీఎంకేకు చెందిన పలువురు కీలక నేతలు ఎన్‌.ఆర్‌. కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైనట్టు సమాచారాలు వెలువడ్డాయి. పీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా ఇన్నాళ్లు పదవిలో కొనసాగి తాజాగా తప్పుకున్న రాందాసు కుమార్తె శ్రీగాంధి, యువజన నేత ముకుందన్‌ పరుశురామన్‌లు పుదుచ్చేరి సీఎం రంగస్వామితో సమావేశం కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. ఈ సందర్భంగా రంగస్వామి వారికి విభూతి పూసి, ఆశీర్వదించడం గమనార్హం. రానున్న రోజులలో తమిళనాడులో ఎన్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసి, విస్తరించే అంశంపై తాజాగా రంగస్వామితో శ్రీగాంధి, ముకుందన్‌ భేటి సందర్భంగా చర్చలు జరిగినట్లు సమాచారం. పుదుచ్చేరితో పాటు తమిళనాడుకు చెందిన పలువురు ముఖ్య నాయకులు త్వరలోనే ఎన్‌.ఆర్‌. కాంగ్రెస్‌లో చేరనున్నారని తెలిసిందే. రంగస్వామితో భేటీ అనంతరం ముకుందన్‌ మాట్లాడుతూ తాము పెద్దాయన రాందాసును కలిసి స్పష్టంగా చెప్పేశామని, ఇకపై పీఎంకే పార్టీలో మనుగడ సాధించ లేమని స్పష్టం చేశారు. పెద్దాయన కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పామన్నారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామితో జరిపిన భేటీకి సంబంధించి వివరాలను త్వరలోనే శుభవార్త చెప్తామని వ్యాఖ్యానించారు.

తమిళనాడు సీఎం విజయ్‌కు పుదుచ్చేరి సీఎం రంగస్వామికి మధ్య స్నేహ పూర్వక బంధం ఉంది. ఇది తాజాగా రాజకీయ అనుబంధం కానున్నది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్‌ టీవీకేకు ఉత్తర తమిళనాడులోని అనేక జిల్లాలలో పెద్దగా ఫలితం దక్కలేదు. ఈ పరిస్థితులలో విజయ్‌కు పక్కబలంగా భవిష్యత్తులో ఉండే దిశగా రంగస్వామి తన పార్టీని ఉత్తర తమిళనాడులోని పలు జిల్లాలకు విస్తరించి, వన్నియర్‌ సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను గురి పెట్టే దిశగావ్యూహాలకు పదును పెట్టారు. ఆ దిశగా కడలూర్‌, విల్లుపురం, కళ్లకురిచి, తిరువణ్ణామలై, నాగపట్నం, మయిలాడుదురై సేలం వంటి ప్రాంతాల్లో తనకు ఉన్న ఆదరణను పరిగణించి ఈ ప్రాంతాల్లో భవిష్యత్తులో బలాన్ని చాటి , ఎన్నికలలో పోటీ చేయాలని ఆయన చాలా కాలంగా భావిస్తున్నారు. తాజా పరిణామాలతో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ను తమిళనాడులో విస్తరింప చేయడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. ఇందుకు అస్త్రంగా రాందాసు కుమార్తె శ్రీగాంధి, మనవడు ముకుందన్‌లతో పాటుగా పీఎంకే అసంతృప్తి వాదులను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement