– నిందితుడి అరెస్టు
తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో హుండీ కానుకలు చోరీ చేస్తూ రెడ్‌హ్యాండడ్‌గా పట్టుబడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం భక్తులు రద్దీగా వున్న సమయంలో ఉత్సవర్ల మండపం ఎదురుగా వున్న హుండీ వద్ద చాలా సేపు ఓ భక్తుడు వేచివుండడంతో సందేహం చెందిన ఆలయ అధికారులు సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా హుండీలో కానుకలు చెల్లించే విధంగా హుండీలో చేతిద్వారా కరెన్సీ నోట్లు తీసుకోవడం గుర్తించి రెడ్ హ్యేండడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుత్తణి పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి హుండీ నుంచి చోరీ చేసిన రూ. 9,170 స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు కరూర్ జిల్లా కోందిమలైకు చెందిన శక్తి వడివేల్‌గా గుర్తించి రిమాండ్ నిమిత్తం కోర్టులో హజరుపరిచి ఆదివారం జైలుకు తరలించారు.
ఆలయ హుండీ లెక్కింపులో గోల్‌మాల్
సాక్షి, చైన్నె : కోయంబత్తూరు నగరంలోని ప్రసిద్ధ శ్రీ కోనియమ్మన్ ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు సమయంలో రూ. 30,000 దొంగిలించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులను దేవాదాయశాఖ సస్పెండ్ చేయగా, దొంగతనానికి పాల్పడిన సిబ్బందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నెల 15వ తేదీన అధికారుల సమక్షంలో కోనియమ్మన్ ఆలయ హుండీలను తెరిచి కానుకలు లెక్కిస్తుండగా, అక్కడున్న కొందరు సిబ్బంది లెక్కింపులోకి రాకుండా ఒక నోట్ల కట్టను దాచిపెట్టి అందులోని రూ. 30,000 అపహరించినట్లు విచారణలో వెల్లడైంది.
విచారణ – పోలీసు అరెస్టులు: ఆలయ కార్యనిర్వహణ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉక్కడం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. టికెట్ కౌంటర్ ఉద్యోగి సుబ్రమణియన్‌తో పాటు పూజారి కృష్ణరాజ్, మరో ఇద్దరు సిబ్బందితో పాటుగా మొత్తం నలుగుర్ని అరెస్టు చేసి కోయంబత్తూరు న్యాయస్థానంలో హాజరుపరిచి సెంట్రల్ జైలుకు తరలించారు.
అధికారులపై చర్యలు:ఈ ఘటనపై దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ముగ్గురు ఆలయ అధికారులను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారి స్థానంలో నూతన అధికారులను నియమించారు. రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనాన్ని సహించేది లేదని, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచాలు అడిగితే ప్రజలు ఇవ్వవద్దని సీఎం విజయ్ స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఈ వేగవంతమైన చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కల్పాకంలో ఇంక్యుబేషన్ ఒప్పందం
సాక్షి, చైన్నె: అంతరిక్ష వాతావరణంలో జీపీయూ ఆధారిత కంప్యూటింగ్ కార్యకలాపాల కోసం రేడియేషన్ రక్షణ వ్యూహాలను అభివృద్ధి చేయడంపై కల్పాక్కంలోని ఇందిరాగాంధీ అణు పరిశోధనా కేంద్రం బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషనన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కల్పాక్కంలోని ఐజీసీఎఆర్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో సాంకేతికతల వినియోగం, పరిశోధనా ల్యాబ్ నుండి భూమికి , అంతరిక్షానికి అనే ఇతివృత్తంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బెంగళూరు ఇస్రో యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ మాజీ డైరెక్టర్ మైల్ స్వామి అన్నాదురై మాట్లాడుతూ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ల ప్రోత్సాహంతో దేశంలోని స్టార్టప్ రంగానికి, ఐజీసీఏఆర్ వంటి అగ్రగామి పరిశోధనా కేంద్రాలకు మధ్య అనుసంధానం, సహకారం వేగంగా పెరుగుతోందని పేర్కొన్నారు.
అంతరిక్ష సాంకేతికతపై ఒప్పందం
మైల్ స్వామి అన్నాదురై మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషనన్స్ అనే డీప్–టెక్ సంస్థతో అంతరిక్షంలో జీపీయూ కంప్యూటింగ్ కోసం రేడియేషన్ రక్షణ విధానాలను రూపొందించడంపై ఈ ఇంక్యుబేషన్ ఒప్పందం ఈ సందర్భంగా కుదిరింది. ఈ ఒప్పంద పత్రాలను ఐజీసీఎఆర్ డైరెక్టర్ శ్రీకుమార్ జి. పిళ్లై, అటల్ ఇంక్యుబేషన్ ) డైరెక్టర్ ఎన్. సుబ్రమణ్యన్ సంస్థ ప్రతినిధులు పరస్పరం మార్చుకున్నారు. కాగా ముంబై బాబా అణు పరిశోధనా కేంద్రంసాంకేతికత బదిలీ విభాగాధిపతి డేనియల్ బాబు అణుశక్తి శాఖ ప్రస్తుత సాంకేతిక బదిలీ, ఇంక్యుబేషన్ విధానాలపై ఈ సందర్భంగా ప్రసంగించారు. అలాగే తమిళనాడు స్టార్టప్ బృందం ప్రముఖ పరిశోధనా సంస్థల నుండి సాంకేతిక హక్కులు పొందే కొత్త స్టార్టప్‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలను సమర్పించింది.


