● నియామకాలను రద్దుకు అన్నామలై పట్టు
సాక్షి, చైన్నె : హెల్త్ ఇనన్‌స్పెక్టర్ పరీక్షలో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగిన నేపథ్యంలో, ప్రస్తుత నియామక ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి కఠిన పర్యవేక్షణలో తిరిగి పరీక్ష నిర్వహించాలని వీ ది లీడర్స్ వ్యవస్థాపకుడు అన్నామలై డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం ఆయన స్పందిస్తూ, గత డీఎంకే పాలనలో మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా హెల్త్ ఇన్‌న్‌స్పెక్టర్ (గ్రేడ్–2) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి, కేవలం 15 రోజుల్లోనే హడావుడిగా పరీక్షలు నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీతో సహా పలు అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఈ అక్రమాలపై గతేడాది ఫిబ్రవరి 24న మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సిబిసిఐడి విచారణకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఆ విచారణ ఇంకా పూర్తి కాలేదన్నారు.. ఇలాంటి పరిస్థితిలో ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాతో తమిళనాడు ప్రభుత్వం నియామక పత్రాలు అందజేయడం తీవ్ర తప్పిదంగా మండిపడ్డారు.
న్యాయస్థానానికి వివరించడంలో విఫలం
కోర్టు సూచనల మేరకే నియామక పత్రాలు ఇచ్చా మని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... విచారణ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని, కష్టపడి చదివిన అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం కోర్టుదృష్టికి తీసుకువెళ్లి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. బాధితులైన యువతకు న్యాయం జరగాలంటే అన్ని పరీక్షా కేంద్రాల సిసిటివి ఫుటేజీలను పరిశీలించి, అక్రమాలకు పాల్పడిన దోషులపై కఠి న చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 7న జరిగిన పరీక్షను, తదనంతర నియామకాలను తక్షణమే రద్దు చేయాలనికోరారు. పారదర్శకతతో, తీవ్ర నిఘా నడుమ తిరిగి పరీక్షను నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు తావులేకుండాచూడాలని అన్నామలై విజ్ఞప్తి చేశారు.


