విజయ దివాస్‌..! | - | Sakshi
Sakshi News home page

విజయ దివాస్‌..!

Jul 27 2026 12:36 AM | Updated on Jul 27 2026 12:36 AM

● కార్గిల్‌ వీరులకు వందనం ● వీర సైనికులకు నివాళి

సాక్షి, చైన్నె: కార్గిల్‌ వీరులకు వీర వందనం సమర్పించే విధంగా చైన్నె, తిరుచ్చి, పుదుచ్చేరి, నీలగిరి జిల్లా వెల్లింగ్‌టన్‌లలోని అమర వీరుల స్తూపాల వద్ద ఆదివారం కార్యక్రమాలు జరిగాయి. చైన్నెలోని వార్‌ మెమోరియల్‌ వద్ద ఆర్మీ వర్గాలు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించాయి. వివరాలు.. 1999లో పాకిస్తాన్‌పై జరిపిన కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ విజయోత్సవాన్ని అంది పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఎందరో వీరులు అమరులయ్యారు. ఈ విజయోత్సవంతో పాటూ అమర వీరులకు నివాళులర్పించే విధంగా ఏటా జూలై 26వ తేదిన కార్గిల్‌ విజయ దివాస్‌ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం చైన్నె మెరీనా తీరంలోని వార్‌ మోమోరియల్‌ పరిసరాలను వివిధ పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఆర్మీ వర్గాలు పుష్పగుచ్ఛాలు ఉంచి గౌరవ వందనం సమర్పించాయి. దక్షిణ భారత ఏరియా ఆర్మీ అధికారి అధికారుల, నావికాదళం, వైమానిక దళం అధికారులు వార్‌ మెమోరియల్‌ స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి వీర వందనం సమర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న వారు తమ అనుభవాలను పంచుకున్నారు. సైనికుల సేవలను గుర్తు చేశారు. ఇక, తిరుచ్చి కంట్రోన్మెంట్‌లోని మేజర్‌ శరవణన్‌ స్మారక స్తూపం వద్ద పలు సంఘాలు, ఆర్మీ వర్గా లు, మాజీ సైనికుల కుటుంబాలు నివాళులర్పించారు. కార్గిల్‌ యుద్ధంలో అమరులైన వీరులకు అంజలి ఘటించారు. చైన్నెలో దక్షిణ భారత ఏరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వి. శ్రీహరి నేతృత్వంలో కార్యక్రమాలు జరిగాయి. కార్గిల్‌ యుద్ధంలో దేశ విజయం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల అసమాన ధైర్యసాహసాలను, అత్యున్నత త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ స్మారక కార్యక్రమంలో త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌) సంయుక్తంగా గౌరవ వందనం సమర్పించగా, ఆర్మీ బ్యాండ్‌ వినిపించిన ’‘ాస్ట్‌ పోస్ట్‌’ ధ్వని వీరమరణం పొందిన సైనికులకు కృతజ్ఞతాంజలి ఘటించింది. కమోడోర్‌ సువరతన్‌ మాగన్‌ (తమిళనాడు – పుదుచ్చేరి నావల్‌ ఏరియా ఫ్లాగ్‌ ఆఫీసర్‌), ఎయిర్‌ కమోడోర్‌ తపన్‌ శర్మ (తాంబరం ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌), మురుగన్‌ (కోస్ట్‌ గార్డ్‌ రీజియన్‌ ఈస్ట్‌ డిస్ట్రిక్ట్‌–5 కమాండర్‌)లతో పాటు రక్షణ దళాల పూర్వ సైనికులు, వీర నారీమణులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరులకు అంజలి ఘటించారు.

చారిత్రక నేపథ్యం..

కాగా, చైన్నె వార్‌ మెమోరియల్‌ను టీ–55 ట్యాంక్‌, నావికాదళానికి చెందిన చారిత్రక చిహ్నాలతో ఆధునీకరించారు. చైన్నె విజయ్‌ వార్‌ మెమోరియల్‌ ప్రాంగణంలో ఈ వేడుకలు నిర్వహించడం ద్వారా రాబోయే తరాలకు సాయుధ దళాల త్యాగాలను, దేశభక్తి స్ఫూర్తిని చాటిచెప్పే విధంగా యుద్ధ ఫిరంగులు, యుద్ధనౌకల నమూనాలతో కొత్త రూపుదిద్దుకున్న చైన్నె యుద్ధ స్మారక చిహ్నం, సైనిక వారసత్వ సముదాయంగా వార్‌ మెమోరియల్‌ను మార్ప చేశారు. మెరీనా బీచ్‌కు, చారిత్రక సెయింట్‌ జార్జ్‌ కోటకు మధ్య ఉన్న ఈ యుద్ధ స్మారక చిహ్నాన్ని మొదట్లో మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో వీరమరణం పొందిన చైన్నె ప్రెసిడెన్సీ సైనికుల జ్ఞాపకార్థం నిర్మించారు. కాలక్రమంలో, స్వాతంత్య్రం తర్వాత జరిగిన అన్ని యుద్ధాలు, సైనిక చర్యల్లో అమరులైన త్రివిధ దళాల వీరులను గౌరవించే జాతీయ స్మారక చిహ్నంగా ఇది రూపుదిద్దుకుంది. ప్రస్తుతం దీనిని భారత సేనల వీరత్వాన్ని చాటిచెప్పే అత్యుత్తమ సైనిక వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దారు. భారత ఆర్మీ దక్షిణ్‌ భారత్‌ ఏరియా హెడ్‌క్వార్టర్స్‌, తమిళనాడు ప్రభుత్వం , చైన్నె కార్పొరేషన్‌లు సంయుక్తంగా ఈ అభివృద్ధి పనులను పూర్తి చేశాయి.

ప్రత్యేక బైక్‌ ర్యాలీ

కార్గిల్‌ యోధుల స్మారకార్థం, యువతలో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లబ్‌హౌస్‌ (ఉత్తండి) నేతృత్వంలో రైడర్లు, భారత సైనిక దళాల సభ్యులతో కూడిన ప్రత్యేక మోటార్‌ సైకిల్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని లెఫ్టినెంట్‌ జనరల్‌ వి. శ్రీహరి జెండా ఊపి ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement