● మదురై, కోయంబత్తూరు మెట్రో నివేదిక తిరస్కరణ
సాక్షి, చైన్నె: మదురై, కోయంబత్తూరు నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులను అమలు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సమర్పించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరోసారి తిరస్కరించి వెనక్కి పంపింది. తగినంత జనాభా లేదనే కారణంతో ఈ ప్రాజెక్టులకు అనుమతి నిరాకరించింది.
రూ.22,000 కోట్లకు పైగా వ్యయంతో ప్రణాళిక
తమిళనాడు ప్రభుత్వం మదురైలో రూ. 11,360 కోట్ల వ్యయంతో (తిరుమంగళం నుండి ఒత్తకడై వరకు 31.93 కి.మీ) , కోయంబత్తూరులో రూ. 10,740 కోట్ల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు కేంద్రానికి సమగ్ర నివేదికలను కేంద్రానికి పంపించింది. 2017 మెట్రో రైల్ విధానం ప్రకారం మెట్రో సేవలు పొందేందుకు సదరు నగరం కనీసం 20 లక్షలు (2 మిలియన్లు) లేదా అంతకంటే ఎక్కువ జనాభాను కలిగి ఉండాలి. అయితే, 2011 జనాభా లెక్కల ఆధారంగా: 2011 అధికారిక గణాంకాల ప్రకారం కోయంబత్తూరు జనాభా 15.84 లక్షలు కాగా, మదురై జనాభా 15 లక్షల కంటే తక్కువగా ఉంది. గత ఏడాది నవంబర్ తొలి సారిగా ఈ నివేదిక ఢిల్లీకి చేరగా తిరస్కరణకు గురైంది. మళ్లీ ఈ ఏడాది మే నెలల రెండోసారి పంపిని ఈ నివేదికలను కేంద్రం వెనక్కి పంపుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. మెట్రోకు బదులుగా బస్సు రవాణా వ్యవస్థను మెరుగుపరచవచ్చని సూచించింది.
తమిళనాడు ప్రభుత్వం వాదన
2011 తర్వాత అధికారిక జనాభా గణన జరగకపోవడం వల్లే ప్రస్తుత జనాభాను నిరూపించలేకపోతున్నామని, ప్రస్తుతం ఈ రెండు నగరాల్లో జనాభా గణనీయంగా పెరిగిందని తమిళనాడు స్పష్టం చేసింది. కోయంబత్తూరు పారిశ్రామిక నగరంగా, మదురై ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నిత్యం లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తున్నాయని, కాబట్టి శాశ్వత జనాభాతో పాటు ఈ ఫ్లోటింగ్ జనాభాను పరిగణనలోకి తీసుకోవాలని కోరినప్పటికీ కేంద్రం తిరస్కరించింది. కేంద్రం తీరుపై ఈ రెండు నగరాల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


