ఏసీబీ.. అటాక్‌! | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ.. అటాక్‌!

Jul 19 2026 1:56 AM | Updated on Jul 19 2026 1:56 AM

● 40కు పైగా రెవెన్యూ కార్యాలయాల్లో దాడులు ● రూ. కోటికి పైగా ’జీ–పే’ అక్రమ వసూళ్ల గుర్తింపు

సాక్షి, చైన్నె : తమిళనాడు రెవెన్యూ శాఖలో అవినీతిపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. రాష్ట్రవ్యాప్తంగా 40కి పైగా తాలూకా కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని భారీ నగదుతో పాటు, డిజిటల్‌ పేమెంట్ల ద్వారా ఏకంగా రూ. కోటికి పైగా లంచాలు వసూలు చేసినట్లు సంచలన సమాచారాలు వెలుగులోక వచ్చాయి.

సేవల పేరిట లంచాల వేధింపులు

సాధారణ ప్రజలకు పట్టా బదిలీలు, చిట్టా, అడంగల్‌, ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, భూమి కొలతలు (సర్వే), భూమి శిస్తు వసూళ్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి కీలక పనులన్నీ తాలూకా కార్యాలయాల ద్వారానే జరుగుతాయి. అయితే, ఈ సేవల కోసం కొందరు అధికారులు, సిబ్బంది పెద్దఎత్తున లంచాలు డిమాండ్‌ చేస్తున్నట్లు లంచనిరోధక శాఖకు వరుసగా ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన అవినీతినిరోధక శాఖ ఐజీ మహేశ్వరి ఉత్తర్వుల మేరకు, శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి రాష్ట్రవ్యాప్తంగా 40కి పైగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వివిధ జిల్లాల్లోని తాలూకా ఆఫీసులపై దాడులకు దిగాయి.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన సోదాలు

చైన్నెతో పాటూ శివారు జిల్లాలు, తిరుచ్చి ఈస్ట్‌, సెంతురై, వేప్పంతట్టై, శీర్కాళి, తిరువోణం, కరూర్‌, పుదుక్కోట్టై, తిరువారూర్‌, చిదంబరం, మేల్మలయనూర్‌, చిన్నసేలం, కోయంబత్తూర్‌ నార్త్‌, ఉడుమలై, తలైవాసల్‌, గోపి, కుమారపాళయం, కృష్ణగిరి చ నల్లంపల్లి సహా 40కి పైగా తాలూకా కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి. తిరుచ్చి ఈస్ట్‌ తాలూకా కార్యాలయంలో రూ. 7 వేల నగదు లభించగా, జీ–పే ద్వారా ఏకంగా రూ. 12 లక్షలు వసూలు చేసినట్లు ఆధారాలు దొరికాయి. పలు ప్రాంతాల్లో అర్థరాత్రి కూడా సోదాలు నిరంతరాయంగా కొనసాగాయి.

ఏసీబీ కార్యాలయం

రూ. కోటికి పైగా డిజిటల్‌ లావాదేవీలు

అధికారులు నేరుగా నగదు రూపంలో లంచం తీసుకుంటే దొరికిపోతామనే భయంతో, ప్రైవేట్‌ వ్యక్తులు లేదా దళారుల జీ–పే నంబర్లను ఉపయోగించి డిజిటల్‌ రూపంలో లంచాలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా రూ. కోటికి పైగా డిజిటల్‌ లావాదేవీలు జరిగినట్లు సమాచారం బయటకు రావడంతో అవినీతి నిరోధక శాఖ పోలీసులు సంబంధిత బ్యాంక్‌ ఖాతాల వివరాలను సేకరించి ముమ్మర విచారణ జరుపుతున్నారు. ఈ భారీ మెరుపు దాడులు తమిళనాడు రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

చైన్నెలో భారీగా డిజిటల్‌ లంచాలు

చైన్నెలోని షోళింగనల్లూరు తాలూకా కార్యాలయంలో జరిగిన సోదాల్లో రూ. 50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, అక్కడి సిబ్బంది కేవలం జీ–పే ద్వారానే రూ. 6 లక్షల వరకు లంచాలు తీసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఒక్క చైన్నె నగరంలోనే 6 కంటే ఎక్కువ కార్యాలయాల్లో ఈ దాడులు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement