పళని భూ స్కాం కేసు విచారణ వేగవంతం | - | Sakshi
Sakshi News home page

పళని భూ స్కాం కేసు విచారణ వేగవంతం

Jul 19 2026 1:56 AM | Updated on Jul 19 2026 1:56 AM

● విక్రేత, కొనుగోలుదారుల ఇళ్లలో సీబీసీఐడీ సోదాలు

సాక్షి, చైన్నె: పళనిలో సుమారు రూ. 100 కోట్ల విలువైన ఆలయ భూముల మోసానికి సంబంధించి కేసు వేగంగా దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో సబ్‌ రిజిస్ట్రార్‌, భూమిని విక్రయించిన వారు, కొనుగోలు చేసిన వ్యక్తులు మరియు సాక్షుల ఇళ్లపై సీబీసీఐడీ పోలీసులు శనివారం వేకువ జాము నుంచి సీబీసీఐడీ అధికారులు సోదాలలో నిమగ్నమయ్యారు.

రూ. 100 కోట్ల భూమి.. రూ. 2 కోట్లకే రిజిస్ట్రేషన్‌

దిండిగల్‌ జిల్లా పళని కొండ దిగువన ఉన్న పూంగా రోడ్డులో దండపాణి స్వామి మఠానికి చెందిన 1.40 ఎకరాల భూమి ఉంది. మార్కెట్‌ విలువ ప్రకారం సుమారు రూ. 100 కోట్లు పలికే ఈ విలువైన భూమిని జూలై 6వ తేదీన ఇద్దరు వ్యక్తులకు కేవలం రూ. 2 కోట్లకే చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ భారీ అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సబ్‌ రిజిస్ట్రార్‌ జస్టిన్‌ మణికందన్‌, జిల్లా రిజిస్ట్రార్‌ శశికళలను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్‌ చేసింది.

హైకోర్టు ఆదేశం

రంగంలోకి సీబీసీఐడీ: ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌పై పళని ఆలయ జాయింట్‌ కమిషనర్‌ ఫిర్యాదు చేయడంతో, సదరు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ కేసు దర్యాప్తును సీబీసీఐడీకి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో సీబీసీఐడీ డీఎస్పీ అజయ్‌ తంగం నేతృత్వంలోని బృందం గత రెండు రోజులుగా పళని దేవస్థానం కార్యాలయం, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ముమ్మర విచారణ జరిపింది.

10కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

ఈ విచారణల కొనసాగింపుగా, శనివారం వేకువ జామున నాలుగు గంటల నుంచి సీబీసీఐడీ ఇన్‌స్పెక్టర్‌ సంతానలక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు 3 బృందాలుగా విడిపోయి దాడులు ప్రారంభించారు. దిండిగల్‌లోని సస్పెండ్‌ అయిన సబ్‌ రిజిస్ట్రార్‌ జస్టిన్‌ మణికందన్‌ ఇల్లు, భూమిని విక్రయించిన వారి ఇళ్లు, కొనుగోలు చేసిన వారిలో ఒకరైన పళని డి.కె.ఎన్‌.పుదూర్‌కు చెందిన సేతుపతి ఇల్లు, అతని బంధువుల ఇళ్లతో పాటు, రిజిస్ట్రేషన్‌కు సాక్ష్యంగా సంతకాలు చేసిన వారి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఒట్టన్‌చత్రంలోని డాక్యుమెంట్‌ రైటర్‌ (పత్రాల రచయిత), ల్యాండ్‌ బ్రోకర్‌ ఇళ్లతో కలిపి మొత్తం 10కి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ భారీ భూమి రిజిస్ట్రేషన్‌ మోసం కేసులో సీబీసీఐడీ పోలీసులు రంగంలోకి దిగి విస్తృతంగా సోదాలు జరుపుతుండటం దిండిగల్‌ జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement