చారిత్రక వైభవం ఉట్టిపడేలా కూనూర్‌ | - | Sakshi
Sakshi News home page

చారిత్రక వైభవం ఉట్టిపడేలా కూనూర్‌

Jul 19 2026 1:56 AM | Updated on Jul 19 2026 1:56 AM

● చెక్కు చెదరని నాటి కళాకృతులు

కూనూర్‌ స్టేషన్‌

సాక్షి, చైన్నె : అమృత్‌ భారత్‌ పథకం మేరకు రూపుదిద్దుకున్న కూనూర్‌ రైల్వే స్టేషన్‌ చారిత్రక వైభవం ఉట్టి పడేలా చెక్కు చెదరని కళాకృతులతో ఆకర్షిస్తున్నది. పర్యాటక ప్రదేశం ఊటి మార్గానికి మరింత వన్నె తెచ్చేరీతిలో ఈ స్టేషన్‌ రూపుదిద్దుకుంది. దేశవ్యాప్తంగా చారిత్రక రైల్వే స్టేషన్లను ఆధునీకరించే అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద తమిళనాడులో చైన్నె పార్క్‌ తదుపరి, నీలగిరి జిల్లా కూనూర్‌ రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించారు. చైన్నె పార్క్‌ స్టేషన్‌కు ఓ చరిత్ర ఉంటే, అందుకు తలదన్నే చరిత్రను కూనూర్‌ కలిగి ఉంది. 1908లో సుమారు 118 సంవత్సరాల క్రితం నీలగిరి పర్వతాలలోని కూనూర్‌ వద్ద బ్రిటీషు మయంలో ఈస్టేషన్‌ రూపుదిద్దుకుంది. పర్యాటక రారాజుగా ప్రసిద్ధి చెందిన నీలగిరి పర్వతాలలోని ఊటీకి వెళ్లే మార్గంలో ఈ కూనూర్‌ ఉంది. తాజాగా తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నీలగిరి జిల్లా కూనూర్‌ రైల్వే స్టేషన్‌ సరికొత్త రూపు సంతరించుకుంది. రూ. 12.18 కోట్ల వ్యయంతో, దాని పురాతన వారసత్వ కట్టడాల శైలి (పాతదనం) దెబ్బతినకుండా పునరుద్ధరించిన కూనూర్‌ రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలో శుక్రవారం జాతికి అంకితం చేశారు.

చెక్కు చెదరని నిర్మాణాలు

కనూర్‌ రైల్వే స్టేషన్‌లో పర్యాటకులను ఆకట్టుకునేలా పలు అత్యాధునిక సదుపాయాలను కల్పించారు. ప్రధానంగా ఇక్కడి ప్రవేశ మార్గాలు, నిర్మాణాలు బ్రిటీషు కాలపు నాటి కళాకృతులు చెక్కు చెదరని రీతిలో పునరుద్దరించడంతో దీనిని చూసేందుకు ఆ పరిసర వాసులు తరలి వస్తున్నారు.ఈ స్టేషన్‌లో అధునాతన రిజర్వేషన్‌ కౌంటర్లు. ప్రయాణికుల కోసం వెయిటింగ్‌ హాళ్లు, విశ్రాంతి గదులు, నీలగిరి అటవీ ప్రాంతంలో కనిపించే వన్యప్రాణులు, పక్షుల అందమైన పెయింటింగులు. ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాల అలంకరణలు అంటూ చారిత్రక వైభవాన్ని చాటే విధంగా ఈ స్టేషన్‌ తాజాగా రూపుదిద్దుకుని ఉండడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement